తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ కుమార్తె మీరా ఆంటోని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏండ్ల మీరా.. చదువుల ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కూతురి ఆకస్మిక మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో ఆత్మహత్యలపై ఆయన మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. 


విజయ్‌ ఆంటోనీ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. అతనికి 7 ఏళ్ళ వయసున్నప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఇప్పుడు కుమార్తె మీరా కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. గతంలో ఓ ఈవెంట్‌ లో విజయ్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయారు. అప్పుడు నాకు 7 సంవత్సరాలు.. మా చెల్లికి ఐదేళ్లు. అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాన్న ఈ లోకాన్ని వెళ్లిపోయాక మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే ఆత్మహత్యల గురించి విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది'' అని విజయ్ ఆంటోనీ అన్నారు.  


యువత, పిల్లలలో ఆత్మహత్య ధోరణుల గురించి విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ''జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల లోతు నాకు తెలుసు. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితి కారణంగా సూసైడ్ ఆలోచనలను కలిగి ఉంటారు. మరికొందరు తాము నమ్మిన వ్యక్తి ద్రోహం చేసినట్లు భావించినప్పుడు ఇలా ఆలోచిస్తారు. పిల్లల్లో చదువుల ఒత్తిడి దీనికి కారణం అవుతుంది. స్కూల్ అయిపోయిన వెంటనే వారిని ట్యూషన్ కి పంపిస్తారు. గుర్తుంచుకోండి, మీరు పిల్లలకి ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వడం లేదని అర్థం చేసుకోండి. దయచేసి అలా చేయకండి. వారిని కొంత సమయం ఫ్రీగా వదిలెయ్యండి. పెద్దల విషయానికొస్తే, వారు సంపాదన.. విజయంపై నిమగ్నమై ఉండకుండా తమను తాము ప్రేమించుకోవాలని నేను కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 


అలానే ఫాతిమా ఆంటోనీ తన ముద్దుల కూతురి గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ త్రోబాక్ పోస్ట్ ఇప్పుడు మీరా మరణం తర్వాత వైరల్ అవుతోంది. మీరా తన స్కూల్ లో కల్చరల్ సెక్రటరీగా ఎంపికవడంతో ఫాతిమా తన కుమార్తె ఫోటోను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది. "నా బలం వెనుక ఉన్న శక్తి.. నా కన్నీళ్లకు ఓదార్పు. నా ఒత్తిడికి కారణం (కొంటెతనం సూపర్ లోడ్).. నా తంగకట్టి-చెల్లకుట్టి మీరా విజయ్ ఆంటోని కంగ్రాట్స్ బేబీ" అని రాసుకొచ్చింది. మీరా మృతితో ఈ పోస్ట్ అందరినీ క‌ల‌చి వేస్తోంది.


Also Read : 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు: సమంత







విజయ్‌ ఆంటోనీ కూతురు మీరా మరణించడంతో సినీ ప్ర‌ముఖులు ఆయన కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేసారు. శింబు, ఉదయనిధి స్టాలిన్, ఖుష్బు సుందర్, రితికా సింగ్, విమల్, ద‌ళ‌పతి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ వంటి వారు మీరా పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. మీరా అంత్యక్రియలు ఈరోజు బుధవారం చెన్నైలో జరగనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: దుబాయ్‌లో అజిత్, సంజయ్ దత్ - ఆ సినిమాలో ఒకరినొకరు ఢీ కొట్టబోతున్నారా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial