Vignesh Shivan: వయనాడ్ బాధితులకు అండగా నయన్, విఘ్నేష్ - సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం

Vignesh Shivan: తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, తన భార్య నయనతారతో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ తరపున కేరళ రిలీఫ్ ఫండ్‌కు విరాళమిస్తున్నట్టుగా విఘ్నేష్ ప్రకటించాడు.

Continues below advertisement

Vignesh Shivan And Nayanthara Donates To Kerala CM Relief Fund: కేరళలోని కొండచరియలు విరిగిపడడం వల్ల 150 మందికి పైగా స్థానికులు చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. అందుకే రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ.. వారికి తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సౌత్ సెలబ్రిటీలు కేరళలోని వాయనాడ్ ప్రజలకు అండగా ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి విఘ్నేష్ శివన్, నయనతార కూడా యాడ్ అయ్యారు. తమ సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన రౌడీ పిక్చర్స్ తరపున కేరళకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

Continues below advertisement

రిలీఫ్ ఫండ్..

ఆర్థిక సాయాన్ని నేరుగా కేరళ ముఖ్యమంత్రికి అందిస్తున్నట్టుగా రౌడీ పిక్చర్స్ లేఖలో వివరించారు. ‘వాయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ఘటన చూస్తుంటే మా మనసులు అక్కడ ఉన్న కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాయి. అక్కడ ఉన్నవారికి జరిగిన నష్టం చూస్తుంటే తట్టుకోలేనంత బాధగా ఉంది. ఇలాంటి కష్ట సమయాల్లోనే ఒకరికొకరం సాయంగా నిలబడడం, సపోర్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తొస్తుంది. అందుకే మా వంతు సాయంగా రూ. 20 లక్షలను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నాం’ అని ప్రకటించాడు విఘ్నేష్ శివన్.

మా వంతు సాయం..

‘ఈ రూ.20 లక్షలతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ.. మళ్లీ వారి జీవితాలను బాగుచేసుకోవడానికి ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు, వాలంటీర్లు, రెస్క్యూ బృందాలు, ఇతర సంస్థల తరపున కేరళకు అందుతున్న సహాయం చూస్తుంటే మనసు కృంగిపోతోంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం కోసం అందరూ కలిసి కష్టపడుతున్నారు. అందరం కలిసి ధైర్యంతో కలిసి ముందడుగు వేద్దాం’ అంటూ తన కుటుంబం తరపున కోరుకున్నారు విఘ్నేష్ శివన్. అంతే కాకుండా ‘వయనాడ్‌లో జరిగిన నష్టాలను ఏం చేసినా సరిచేయలేం. కానీ మా వంతు సాయాన్ని అందిస్తున్నాం’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు.

సినిమాల్లో బిజీ..

ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్.. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలు ఉయిర్, ఉలగ్‌లో సమయాన్ని గడుపుతూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. నయనతార విషయానికొస్తే.. యంగ్ హీరో కెవిన్‌తో కలిసి ఒక మూవీలో నటించడానికి సిద్ధమయ్యింది ఈ భామ. విఘ్నేష్ శివన్ చాలాకాలం తర్వాత దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకొని ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ని తెరకెక్కిస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి.. ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి.

Also Read: మంచి మనసు చాటుకున్న చియాన్ విక్రమ్, వయనాడ్ బాధితులకు అండగా నిలిచిన ‘తంగళన్‘ నటుడు

Continues below advertisement