తమిళ నటుడు చియాన్ విక్రమ్ కేరళ ప్రకృతి విలయతాండవం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన 150 మందికి పైగా చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయన నిధికి రూ. 20 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని విక్రమ్ మేనేజర్ యువరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 150 మందికి పైగా మరణించారు. 197 మంది గాయపడ్డారు. చాలా మంది తప్పిపోయారు. ఎంతో మంది ఆచూకీ సైతం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో నటుడు చియాన్ విక్రమ్ స్పందించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు" అని రాసుకొచ్చారు.






వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయం


కేరళలో  ప్రకృతి కరాళనృత్యం చేస్తోంది. మెప్పాడి రీజియన్‌ లోని  చాలా ప్రాంతాల్లో గత  అర్థరాత్రి దాటిన తర్వాత కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో పలు ఇళ్లు మట్టి పెళ్లల కింద కూరుకుపోయాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 150కి పైగా మృతదేహాలను వెలికితీశాయి. చనిపోయిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో 1500 మంది శిథిలాల కింద చిక్కుకొనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు స్థానిక సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. వీరికి తోడు భారత సైన్యం సైతం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు సుమారు 400 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 


గత కొద్ది రోజులుగా కేరళలో భారీ వర్షాలు


గత కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు తోడుకావడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం జరుగుతోంది. భారీ వరదల కారణంగా వయనాడ్‌ లోని పలు బ్రిడ్జిలు తెగిపోయాయి. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. చాలా జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.  


‘తంగళన్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చియాన్


అటు చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగళన్’ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో విక్రమ్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తునాడు. అటు ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రఘు తాత’ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతున్నాయి. అటు విక్రమ్ దర్శకుడు SU అరుణ్ కుమార్ తో కలిస 'వీర ధీరన్ సూరన్: పార్ట్ 2'లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా విడుదలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also Read: వారం ముందే హెచ్చరించాం, ప్రభుత్వం పట్టించుకోలేదు - వయనాడ్‌ విపత్తుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు