తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ (Costumes Krishna) ఇకలేరు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. స్వస్థలం విశాఖ. 


'సురేష్' కృష్ణ నుంచి 'కాస్ట్యూమ్స్' కృష్ణగా...
కృష్ణ పేరుతో తెలుగు చిత్రసీమలో చాలా మంది ఉన్నారు. కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ఈయన ఒక్కరే. ఎందుకంటే... తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. ఆయన 1954లో మద్రాస్ వెళ్లారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పని చేశారు. ఆ సమయంలో ఆయన్ను 'సురేష్' కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది. 


'భారత్ బంద్'తో నటుడిగా పరిచయమై...
కాస్ట్యూమ్స్ కృష్ణ తెరవెనుక ఉన్న ఆయన... 'భారత్ బంద్'తో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ అవకాశం రావడం వెనుక ఓ కథ ఉంది. కృష్ణ ఇంటి పైన ఆఫీసులో దర్శకుడు కోడి రామకృష్ణ ఉండేవారు. ఆయనే పిలిచి మూడు రోజులు వేషం వేయమని అడగడంతో... అయిష్టంగా ఓకే చెప్పారు. ఒకవేళ ఆయన ఆ పాత్ర చేయలేకపోతే ఆప్షన్ కింద కోట శ్రీనివాసరావుతో పాటు మరొక నటుడిని కూడా చిత్రీకరణ దగ్గరకు రప్పించారు. 


Also Read : తనికెళ్ళ భరణి దర్శకత్వంలో 'చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1' సినిమా


ఆ తర్వాత 'పెళ్ళాం చెబితే వినాలి', 'పోలీస్ లాకప్', 'అల్లరి మొగుడు', 'దేవుళ్ళు', 'మా ఆయన బంగారం', 'విలన్', 'శాంభవి ఐపిఎస్', 'పుట్టింటికి రా చెల్లి' తదితర సినిమాల్లో నటించారు.


నిర్మాతగానూ సినిమాలు తీశారు!
నిర్మాతగా కష్టపడ్డాను తప్ప లాభాలు రాలేదని  కాస్ట్యూమ్స్ కృష్ణ ఓ సమయంలో చెప్పారు. జగపతి బాబు కథానాయకుడిగా నటించిన 'పెళ్లి పందిరి' సినిమా నిర్మాత ఆయనే. అంతకు ముందు 'అరుంధతి' అని ఓ సినిమా తీశారు. సూపర్ స్టార్ కృష్ణ 'అశ్వత్థామ' సినిమాకూ ఆయనే నిర్మాత. ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కొన్ని వేషాలు కూడా వేశారు. నిర్మాతగా 8 సినిమాలు తీశారు.


'పెళ్లి పందిరి' రైట్స్ 'దిల్' రాజుకు ఇవ్వడం వెనుక... 
కన్నడలో విజయవంతమైన ఓ సినిమా రీమేక్ రైట్స్ కొని 'అరుంధతి' పేరుతో కాస్ట్యూమ్స్ కృష్ణ రీమేక్ చేశారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 36 లక్షలకు 'దిల్' రాజు కొన్నారు. అయితే, విడుదలకు ముందు రూ. 34 లక్షలే ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే నాలుగు రోజుల్లో మరో రూ. 2 లక్షలు 'దిల్' రాజు ఇవ్వడంతో కాస్ట్యూమ్స్ కృష్ణ ఆశ్చర్యపోయారు. అందుకని, ఆ తర్వాత తాను నిర్మించిన 'పెళ్లి పందిరి' సినిమాకు చాలా మంది డబుల్ రేట్ ఆఫర్ చేసినా సరే... 'దిల్' రాజుకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మూసేశామని 'దిల్' రాజు చెప్పినా సరే... అడ్వాన్స్ తీసుకోకుండా రైట్స్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ఆయన నటన, చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు.


కాస్ట్యూమ్స్ కృష్ణకు నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయిలు ఇద్దరికీ ఇద్దరు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. చిన్న అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 


Also Read అమ్మది అలెప్పీ అయినా... కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్