తనికెళ్ళ భరణి (Tanikella Bharani)లో గొప్ప నటుడు ఉన్నారు. ఈ తరం, ఆ తరం అని వ్యత్యాసం లేకుండా ప్రేక్షకులు అందరికీ ఆ విషయం తెలుసు. ఆయనలో ఓ రచయిత కూడా ఉన్నారు. 'లేడీస్ టైలర్', 'మహర్షి', 'శివ', 'నారీ నారీ నడుమ మురారి', 'మనీ మనీ' తదితర చిత్రాలకు ఆయన రైటర్. కొంత మంది ప్రేక్షకులకు ఈ విషయం తెలుసు.
తనికెళ్ళ భరణిలో దర్శకుడు కూడా ఉన్నారు. 'మిథునం' సినిమా (Mithunam Movie) చూసిన ప్రేక్షకులకు ఆయనలో ఎంత గొప్ప దర్శకుడు ఉన్నాడనేది తెలుస్తుంది. పదేళ్ళ విరామం తర్వాత ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. బాల్య జ్ఞాపకాల నేపథ్యంలో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తనికెళ్ళ భరణి తెలిపారు. సినిమా టైటిల్ కూడా వెల్లడించారు.
'చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1'
దర్శకుడిగా తనికెళ్ళ భరణి రెండో సినిమా 'చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1' (Chilakalguda Railway Quarters 221/1). ఈ టైటిల్ వెనుక ఓ కథ ఉంది. అది ఏమిటంటే... తనికెళ్ళ భరణి తండ్రి రైల్వే ఉద్యోగి. అందువల్ల, బాల్యంలో కొన్ని రోజులు చిలకలగూడ ప్రాంతంలో ఉన్నారు. రైల్వే ఉద్యోగులకు క్వార్టర్స్ ఇస్తారు కదా! వాటిలో అన్నమాట! తనికెళ్ళ ఫ్యామిలీ నివాసం ఉన్న క్వార్టర్ నంబర్ 221/1. ఆ ఇంటి పేరుతో సినిమా తీయాలని ఉందని తన మనసులో కోరికను ఆయన బయట పెట్టారు.
దక్షిణ మధ్య రైల్వే కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ళ భరణిని ఆత్మీయంగా సత్కరించారు. ఆ వేడుకలో 'చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1' సినిమాను ప్రకటించారు. రైల్ నిలయం నిర్మాణం తన కళ్ళ ముందు జరిగిందని ఆయన తెలిపారు.
దేశం మొత్తం మూడుసార్లు తిరిగా - తనికెళ్ళ భరణి
తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో దేశం మొత్తం మూడుసార్లు తిరిగానని తనికెళ్ళ భరణి తెలిపారు. ఏనాడూ టికెట్ కొనకుండా ఫ్లాట్ ఫార్మ్ ఎక్కలేదని స్పష్టం చేశారు. విమానంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ... రైలులో ప్రయాణం చేయడం తనకు ఇష్టమని పేర్కొన్నారు. తనకు రైలు మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. యూరప్ వెళ్లిన ప్రతిసారీ అక్కడ రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను రైల్వే కళాశాలలో చదివానని, తాను రాసిన తొలి నాటకం 'కొక్కొరోకో'ను బోయిగూడ రైల్ కళారంగ్ ఆడిటోరియంలో ప్రదర్శించనని తనికెళ్ళ భరణి వివరించారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తనకు గురువు అయినటువంటి తనికెళ్ళ భరణిని సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తెలిపారు.
Also Read : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!
నటుడిగా తనికెళ్ళ బిజీ బిజీ!
ప్రస్తుతం తనికెళ్ళ భరణి నటుడిగా బిజీ బిజీగా ఉన్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' సినిమాలో ప్రకాష్ రాజ్ సన్మాన సన్నివేశంలో ఆయన కనిపించారు. ధనుష్ 'సార్' సినిమాలోనూ నటించారు. 'ధమాకా'లో మాస్ మహారాజా రవితేజ తండ్రి పాత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట', విక్టరీ వెంకటేష్ & మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' తదితర హిట్ సినిమాల్లో ఆయన ఉన్నారు.
Also Read : అమ్మది అలెప్పీ అయినా... కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్