తెలుగు ప్రేక్షకులకు సమంత (Samantha) మన అమ్మాయే. ఆమెను చాలా మంది తెలుగమ్మాయిలా చూస్తారు. అయితే, ఆమెది తమిళనాడు. చెన్నైలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి సమంత! ఆమెకు కేరళ మూలాలు కూడా ఉన్నాయి. అవును, సమంత తల్లిది గాడ్స్ ఓన్ కంట్రీలోని అలెప్పీ. తల్లిది కేరళ అయినప్పటికీ... సమంతకు మలయాళం మాట్లాడటం రాదు. అందుకు కారణం కూడా తన తల్లే అని ఆమె చెబుతున్నారు. 


ఇంట్లో మలయాళం నేర్పలేదు - సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'శాకుంతలం'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో  విడుదల అవుతోంది. ఏప్రిల్ 14న పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట! సినిమా ప్రమోషన్స్ కోసం కొచ్చి వెళ్లారు సమంత. అక్కడ తన తల్లిది కేరళ అని, అయితే ఇంట్లో ఒక్క ముక్క కూడా మలయాళం నేర్పలేదని, అందువల్ల స్పష్టంగా మలయాళంలో మాట్లాడటం లేదని ఆమె తెలిపారు. అదీ సంగతి!


'శాకుంతలం'లో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. కేరళ కుర్రాడు కాబట్టి మలయాళంలో గలగలా మాట్లాడారు. అతని సహాయం తీసుకున్నట్లు సమంత తెలిపారు. దేవ్ మోహన్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో ఎలా మాట్లాడాలో తాను నేర్పించానని, ఇప్పుడు అతన్ని మలయాళం గురించి అడుగుతున్నానని తెలిపారు. 


మాలీవుడ్ అఫర్ వస్తే మలయాళం నేర్చుకుంటా - సమంత 
తనకు ఇష్టమైన నటులతో మలయాళంలో సినిమా చేసే అవకాశం వస్తే... అప్పుడు తప్పకుండా ఆ భాష నేర్చుకుంటానని సమంత తెలిపారు. స్వయంగా డబ్బింగ్ కూడా చెబుతానని అన్నారు. కొచ్చిలోని 'శాకుంతలం' ప్రెస్‌మీట్‌లో సమంత స్పీచ్ వింటే... మధ్యలో తెలుగు పదాలు వచ్చేశాయి.


'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. సుమారు నెల ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసేశారు. ఆల్రెడీ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యింది. గుణశేఖర్, నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత సినిమా చూశారు. రివ్యూ కూడా ఇచ్చారు.


Also Read : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!






''ఫైనల్లీ... 'శాకుంతలం' చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శకుంతల, దుష్యంత మహారాజు కథకు ఆయన ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన 'దిల్' రాజు, నీలిమా గుణలకు థాంక్స్'' అని సమంత తెలిపారు. 


మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'మల్లికా.... మల్లిక', 'ఏలేలో ఏలేలో...', 'ఋషి వనములోన...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం.


Also Read కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి