సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూత


తెలుగు సినిమా పరిశ్రమ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. కొద్ది కాలం క్రితం అమెరికాలో ఉంటున్న తన కుమార్తె దగ్గరికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మిచిగాన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తన కూతురే దగ్గరుండి ఆయన సపర్యలు చేస్తోంది. ఆరోగ్యం విషమించడంతో ఆయన అక్టోబరు 31న చనిపోయారు. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది.


ఈశ్వరరావు మృతి పట్ల సినీ ప్రముఖల నివాళి


సీనియర్ నటుడు ఈశ్వరరావు చనిపోయారనే విషయం తెలియడంతో తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు బయటకు చెప్పకపోవడం పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల నివాళులు అర్పిస్తున్నారు. ఈశ్వరరావు లాంటి నటుడిని కోల్పోవడం నిజంగా బాధాకరం అంటున్నారు. అటు పలువురు సినీ అభిమానులు సైతం ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.


200లకు పైగా సినిమాల్లో నటించిన ఈశ్వరరావు


నటుడు ఈశ్వరరావు దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారు. అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ చిత్రంతో ఈశ్వరరావు తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే నటుడు మోహన్ బాబు కూడా సినీ ప్రవేశం చేశారు. ఈశ్వరరావు నటించిన తొలి సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత ఈశ్వరరావుకు వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాదు, తన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’లో నటనకు గానూ ఆయన నంది అవార్డును దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘దేవతలారా దీవించండి’, ‘ప్రేమాభిషేకం’, ‘యుగపురుషుడు’ ‘దయామయుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి’, ‘జయం మనదే’, ‘శభాష్‌ గోపి’ లాంటి అద్భుత చిత్రాల్లో నటించారు. ఈశ్వరరావు చివరి సారిగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలో కనిపించారు.


బుల్లితెరపైనా సత్తా చాటిన ఈశ్వరరావు


సినిమా పరిశ్రమకు దూరం అయిన తర్వాత బుల్లితెరపైనా ఈశ్వరరావు సత్తా  చాటారు. ఆయన ఎన్నో సీరియల్స్ లో నటించారు. తెలుగు బుల్లితెర అభిమానుల మనసులను చూరగొన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన బుల్లితెర అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప నటుడిని కోల్పోయామని బాధపడుతున్నారు. అశృనయనాలతో నివాళి అర్పిస్తున్నారు.


Read Also: సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్, చట్టప్రకారం ‘వ్యూహం’ విడుదల అవుతుంది: ఆర్జీవీ


Read Also: సమంత ‘ఎవెంజర్’ టీమ్ మెంబర్స్ వీళ్లే, ఈ టాలీవుడ్ హీరోలకే సామ్ ఓటు


Read Also: నా మాటలు విని శ్రీ‌దేవి కంటతడి పెట్టింది, ఆమెను అలా చూసి చాలా బాధేసింది- ఆదిల్ హుస్సేన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial