దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది.   సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

  


చట్టపరంగా సినిమా విడుదల చేస్తాం-ఆర్జీవీ


సెన్సార్ బోర్డు నిర్ణయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. పొలిటిక్ పార్టీల మీద తీసిన సినిమాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. “సెన్సార్ విషయంలో తన సినిమాలు మాత్రమే కాదు, చాలా సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చాలా సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు ఉంటాయన్నారు. సబ్జెక్ట్ విషయంలో కొన్ని సినిమాలు బాగా ప్రచారం పొందుతాయి. మరికొన్ని అంతగా ప్రజల దృష్టికి రావు. ‘గోవిందా గోవిందా’ అనే సినిమాను తిరుపతి మీద  తీయడంతోనే ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది. వాస్తవానికి ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అనే అంశం సెన్సార్ బోర్డు పరిధిలోకి రాదు. సినిమాలో వల్గారిటీ ఉందా? కుల మతాల అంశం ఉందా? ఇరు వర్గాల మధ్య చిచ్చు చెలరేగే అవకాశం ఉందా? అని పరిశీలించి లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ‘వ్యూహం’ సినిమా పొలిటికల్ పార్టీల మీద తీసిన సినిమా. వ్యక్తుల మీద తీసిన  చిత్రం. సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ‘కమ్మరాజ్యం’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాలు కూడా ఇలాంటివే. ‘ది యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్’ అని సోనియా, మన్మోహన్ మీద చేశారు. గత 4 ఏండ్లలో ఇలాంటి 7, 8 సినిమాలు వచ్చాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా,  ఎన్నికల సమయం అంటూ ఈసీ ఈ సినిమా విడుదలకు అవకాశం ఇవ్వకపోయినా, చట్టప్రకారం ముందుకు వెళ్తాం.  కోర్టులో న్యాయపోరాటం చేస్తాం. ‘ఉడ్తా పంజాబ్’,. ‘పద్మావత్’ మాదిరిగానే మా పోరాటం ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ సిస్టమ్” అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.


రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రాంగోపాల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రెండు భాగాలుగా రానుంది.'వ్యూహం'తో పాటు పార్ట్-2 ని 'శపథం' పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. 'వ్యూహం' సినిమాని నవంబర్ 10న, 'శపథం' మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నారు ఆర్జీవి. ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ భార్య వైయస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Read Also: నా మాటలు విని శ్రీ‌దేవి కంటతడి పెట్టింది, ఆమెను అలా చూసి చాలా బాధేసింది- ఆదిల్ హుస్సేన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial