Venu Swamy: న్యూ ఇయర్ సందర్భంగా సినీ సెలబ్రిటీలంతా తమ ఫ్యాన్స్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి.. ఈ కొత్త సంవత్సరం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా.. వచ్చేది క్రోధి నామ సంవత్సరం అని, ఈ సంవత్సరం రాజు కుజుడు అని, మంత్రి శని అని బయటపెట్టారు. ఈ రెండు కూడా ఎక్కువగా చెడు ప్రభావాలు ఇచ్చేవే అని అన్నారు. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి ప్రజలను పీడిస్తుందని, అది ప్రపంచం మొత్తం కావచ్చు లేదా ఏదో ఒక దేశంలో అయినా కావచ్చని తెలిపారు.


వారంతా జైలుకే..


రాజకీయాల గురించి కూడా వేణు స్వామి మాట్లాడారు. ‘‘భారతదేశంలో ఈ సంవత్సరం రాష్ట్రాల మధ్య గొడవలు లేదా కేంద్రానికి, రాష్ట్రాల మధ్య కూడా గొడవలు ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రముఖ నాయకులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. భారతదేశంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది. ఆయన జాగ్రత్తగా ఉండాలి’’ అని షాకింగ్ విషయాలు చెప్పారు వేణు స్వామి.


వారి వ్యక్తిగత జీవితాలు బయటికి..


‘‘తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు గానీ, మాజీ ఎమ్మెల్యేలు గానీ జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో వ్యాపారవేత్తలు కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడి వారసుడి వ్యక్తిగత జీవితం సంచలనానికి దారితీసే అవకాశం ఉంది’’ అంటూ పలువురి జైలు జాతకాల గురించి తెలిపారు వేణు స్వామి. అంతే కాకుండా సినీ సెలబ్రిటీల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఒక ప్రముఖ తెలుగు యాంకర్‌కు ఉన్న సమస్యల గురించి బయటికి తెలుస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ప్రముఖ హీరో.. సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడు. అంతే కాకుండా ఒక బాలీవుడ్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయం బయటపడనుంది’’ అని అన్నారు.


ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువే..


ఇక ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువగా ఉంటాయని వేణు స్వామి తెలిపారు. మునుపటికంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తాయన్నారు. అగ్నిపర్వతాలు బద్దలవుతాయని, అతివృష్టి లేదా అనావృష్టి అనేవి ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఇవన్నీ పూర్తిగా ఈ ఏడాదిలో జరగనున్న మార్పులు అని, ఇక త్వరలోనే రాశులకు సంబంధించి ఎలాంటి మార్పులు జరగనున్నాయని స్పష్టంగా సోషల్ మీడియాలో వివరిస్తానని వేణు స్వామి హామీ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రాశి ఫలాలను, వాటి వివరాలను చెప్తానని అన్నారు. అయితే రాజకీయ నాయకుల జైలు జీవితాల గురించి, సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






Also Read: ఇంకొకసారి నా జోలికి రావద్దు, ఇదే రిపీట్ అయితే మాత్రం.. - బూతులతో అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్