Varun Sandesh's One Way Ticket Movie News: హీరో వరుణ్ సందేశ్ వరుస సినిమాలు చేస్తున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హీరోగా కొత్త సినిమా 'వన్ వే టికెట్' మొదలైంది. ఈ చిత్రాన్ని శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. దీనికి ఏ. పళని స్వామి దర్శకుడు. జొరిగే శ్రీనివాస రావు నిర్మాత. 

వరుణ్ సందేశ్ జోడీగా ఖుష్బూ!'వన్ వే టికెట్' సినిమాలో వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్ ఖుష్బూ చౌదరి యాక్ట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా... చిత్ర బృందానికి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టీఎస్ రావు అతిథిగా విచ్చేశారు.

'వన్ వే టికెట్' ప్రారంభోత్సవంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ... ''ఒకప్పుడు మా వరుణ్ సందేశ్‌ వైభోగం ఒకప్పుడు నేను చూశా. మా డార్లింగ్‌కు ఓ హిట్ రావాలన్నదే నా కల. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... ''టైటిల్ కొత్తగా అనిపించింది. పళని గారు చెప్పిన కథ ఇంకా నచ్చింది. ఇందులో నేను ఓ కొత్త పాత్ర పోషిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా సంగీత దర్శకుడు కార్తీక్ గారు మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం'' అని అన్నారు.  నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంస్థలపై రెండో చిత్రమిది'' అని అన్నారు. 

Also Read: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!

వన్ వే టికెట్... ఇదొక క్రైమ్ థ్రిల్లర్!దర్శకుడు ఏ పళని స్వామి మాట్లాడుతూ... ''వన్ వే టికెట్ - ఇదొక క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. మంచి స్క్రిప్ట్ కుదిరింది. హీరో వరుణ్ సందేశ్, నిర్మాత శ్రీనివాస రావు మంచి సపోర్ట్ ఇస్తున్నారు'' అని అన్నారు. వరుణ్ సందేశ్ గారితో నటిస్తుండటం సంతోషంగా ఉందని ఖుష్భూ చౌదరి చెప్పారు. 13 ఏళ్ళ తర్వాత వరుణ్ సందేశ్, తాను కలిసి చేస్తున్న చిత్రమిదని సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తెలిపారు. నటులు మనోజ్ నందం, సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లిద్దరూ సినిమాలో కీలక పాత్రలు చేయనున్నారు.

Also Read చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా