సాక్షి వైద్య (Sakshi Vaidya)... తెలుగులో ఆమె నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటే విడుదల అయ్యింది. 'ఏజెంట్'లో అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడిన అమ్మాయిగా నటించిన ఉత్తరాది భామ ఈ అమ్మాయే. 'ఏజెంట్' విడుదలకు ముందు తెలుగులో మరో అవకాశాన్ని అందుకున్నారామె. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు!


'ఉస్తాద్ భగత్ సింగ్'లో సాక్షి వైద్య!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). ఇందులో ఓ కథానాయికగా శ్రీ లీల నటిస్తున్నారు. మరో నాయికకు కూడా చోటు ఉంది. ఆ అవకాశం సాక్షి వైద్య అందుకున్నారని తెలిసింది. 


సాక్షి వైద్య మీద కొన్ని రోజుల క్రితం ఫొటోషూట్ చేశారు. ఆ తర్వాత పాత్రకు ఆమె సూట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ షెడ్యూల్ లో ఆమెపై సన్నివేశాలు తెరకెక్కించే అవకాశం ఉంది.


వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున'లో...
'ఉస్తాద్ భగత్ సింగ్' కంటే ముందు మెగా ఫ్యామిలీ హీరోతో సాక్షి వైద్య నటించారు. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న 'గాంఢీవధారి అర్జున'లో కథానాయికగా చేశారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా మరో మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారని తెలిసింది. అది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కాదు... సాయి తేజ్ సినిమా!


సాయి ధరమ్ తేజ్ జోడీగా సాక్షి వైద్య!
వంద కోట్ల వసూళ్ళు సాధించిన 'విరూపాక్ష' విజయం సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కు, హీరోగా అతని కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. అందులో సాక్షి వైద్యను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. దాంతో జయంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'విరూపాక్ష' విజయం తర్వాత మరోసారి హీరో, దర్శకుడు కలిసి చేస్తున్న చిత్రమిది. 'విరూపాక్ష' విడుదల కంటే ముందు కొబ్బరికాయ కొట్టారు. సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో సాక్షి వైద్య సెలెక్ట్ అయ్యారు. 


'ఏజెంట్' విడుదల తర్వాత అందులో హీరో అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఏదీ అధికారికంగా రాలేదు. ఆ రిజల్ట్ ఆయన్ను డిజప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. అయితే... ఆ సినిమాతో కథానాయికగా పరిచయమైన సాక్షి వైద్య మాత్రం మరో మూడు సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. 'ఏజెంట్' విడుదల కంటే ముందు సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం సాక్షి వైద్యను చిత్ర బృందం సంప్రదించారని తెలిసింది. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్... ఇప్పుడు సాక్షి వైద్య చేతిలో ఉన్న మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే. నెక్స్ట్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి అవకాశాలు రావొచ్చు. 


Also Read ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే 2 లక్షలు అడుగుతావా? సుమన్‌పై శివనాగు ఫైర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial