అక్కినేని వారసుడు యూత్ కింగ్ అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. స్టైలిష్ ఫిలిం మేకర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న ఈ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. 


స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'ఏజెంట్' సినిమాలో సురేదర్ రెడ్డి ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో అఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఆడి పాడనుందని అంటున్నారు. మాజీ మిస్ ఇండియా యూనివర్స్ అయిన ఊర్వశి.. ఇటీవల 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. అలానే రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అఖిల్ సినిమాలోనూ ప్రత్యేక గీతంలో మెరవనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 


'ఏజెంట్' సినిమాకు హిప్ హాఫ్ తమిజ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్ళీ మళ్ళీ', 'ఏందే ఏందే' అనే రెండు మెలోడీ సాంగ్స్ సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. హిప్ హాఫ్ ఇప్పుడు ఐటెం సాంగ్ కోసం ఓ స్పెషల్ ట్యూన్ ను రెడీ చేశారట. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో కొరియోగ్రఫీ చేయబడుతున్న ఈ పాటలో అఖిల్, ఊర్వశీల స్టెప్పులు మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తాయని భావిస్తున్నారు. 


కాగా, 'ఏజెంట్' సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు. దీని కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసి పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీ, లాంగ్ హెయిర్ స్టైల్ తో అందరితో వావ్ అనిపించుకున్నాడు. ఇక ఇందులో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. 


'ఏజెంట్' చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్2 సినిమా బ్యానర్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. ఇది అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. అన్నీ కలుపుకొని దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇది అక్కినేని హీరోకి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. 


'ఏజెంట్' చిత్రాన్ని ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే అఫీషియల్ గా ప్రకటించారు. విడుదలకు కేవలం 18 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా, ఇంకా రెండు సాంగ్స్ షూటింగ్ పెండింగ్ ఉంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. మిగిలిన ఐటెం సాంగ్ ని కూడా వీలైనంత త్వరగా షూట్ చేసి, జెట్ స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. 'ఏజెంట్' తో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో చూడాలి.


Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌ గా, సింగిల్ క్యారెక్టర్‌ తో సినిమా