Uorfi Javed: సోషల్ మీడియాలో వింత వింత దుస్తులతో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. పలు టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె వేసుకునే వెరైటీ దుస్తులతోనే నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.


‘LSD 2’తో వెండితెరకు పరిచయం


వెరైటీ డ్రెస్సుల హాట్ బ్యూటీ ఉర్పీ ఇప్పుడు వెండితెరపైకి అడుగు పెట్టబోతోంది. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘LSD 2’లో కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించగా,  తను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె లీడ్ రోల్ కు సరిగ్గా సరిపోతుందని భావించారట. మొత్తంగా ఇంతకాలం బుల్లితెరపై, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఉర్ఫీ, ఈ సినిమాతో వెండితెర పైనా సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు.     


2010లో ‘LSD’ చిత్రం విడుదల


ఏక్తా కపూర్ నిర్మాతగా 2010లో ‘LSD’ చిత్రం విడుదల అయ్యింది. ఇందులో రాజ్‌ కుమార్ రావు, నేహా చౌహాన్, అన్షుమాన్ ఝా, నుష్రత్ భరుచ్చా కీలక పాత్రలు పోషించారు.  ALT ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్, ప్రియా శ్రీధరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా పరువు హత్య, MMS స్కాండల్, స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించి మూడు వేర్వేరు కథలను కలిపి తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా ‘LSD 2’ను తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే ‘LSD 2’ సినిమాకు సంబంధించిన వీడియో పోస్టర్ ను ఏక్తా కపూర్ విడుదల చేసింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో యువతీ యువకులు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ ద్వారా ఎలా పరిచయం అవుతున్నారు? ఎలా ప్రేమలో పడుతున్నా? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తుషార్ కపూర్, మౌని రాయ్ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు వారితో ఉర్ఫీ జతకట్టబోతోంది.  






‘LSD 2’ గురించి..


బాలాజీ మోషన్ పిక్చర్స్, కల్ట్ మూవీస్ సమర్పణలో ఏక్తా కపూర్, శోభా కపూర్ ‘LSD 2’ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 19న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దిబాకర్ చివరిగా దర్శకత్వం వహించినచిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. ఇందులో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా నటించారు. 2021లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.   


Read Also: ‘మంకీ మ్యాన్’ మూవీకి స్టాండింగ్ ఒవేషన్ - హాలీవుడ్‌లో హనుమంతుడి మూవీకి యమ క్రేజ్