Dev Patels ‘Monkey Man’ Receives Standing Ovation: హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రూపొందించిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. ఈ మధ్యనే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అలాంటి స్టోరీతోనే హాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కించింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘మంకీ మ్యాన్’ పేరుతో రూపొందిన సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


‘మంకీ మ్యాన్’కు SXSWలో ప్రశంసలు


భారతీయుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ఆంజనేయుడిని స్ఫూర్తిగా తీసుకొని ‘మంకీ మ్యాన్’ సినిమాను తెరకెక్కించారు దేవ్ పటేల్. హీరో హనుమంతుడి ప్రేరణగా తీసుకుని దుర్మార్గుల నుంచి ప్రజలను ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. తాజాగా ఈ చిత్రాన్ని SXSW వేడుకలో స్ర్కీనింగ్ చేశారు. తన తల్లి మరణానికి కారణం అయిన వాళ్లను హీరో ఎలా అంతం చేశాడు అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు దేవ్ పటేల్. మదర్ సెంటిమెంట్, ముంబై పరిసరాలు, ప్రతీకారం, కుల వ్యవస్థను ఈ సినిమాలో ప్రస్తావించారు. సినిమాను ముందుకు నడిపే విధానం, అద్భుతమైన విజువల్ ట్రీట్ హాలీవుడ్ ప్రముఖులను ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. తన సినిమాకు వచ్చిన ప్రశంసలను చూసిన దేవ్ పటేల్ ఎమోషన్ అయ్యారు.  


నాకు నిజమైన స్పూర్తి హనుమాన్!


‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న దేవ్ పటేల్ ‘మంకీ మ్యాన్’  సినిమాతో హాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సినిమా స్క్రీనింగ్ తర్వాత మాట్లాడిన ఆయన, తనకు నిజమైన స్ఫూర్తి లార్డ్ హనుమాన్ అన్నారు. హనుమంతుడు భక్తి, విధేయత, శౌర్యం, బలం, వినయం, క్రమ శిక్షణకు మారుపేరుగా నిలిచే దేవుడు అన్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రను హనుమాన్ నుంచే ప్రేరణపొంది రూపొందించినట్లు చెప్పారు. రామాయణం, మహా భారతం నుంచి ప్రేరణ పొందిన చిత్రాలు భారత్ లో చాలా ఉన్నా, హాలీవుడ్ లో మాత్రం ఇదే తొలి చిత్రం అన్నారు. ఈ సినిమాతో భగవంతుడు హనుమాన్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకున్నట్లు తెలిపారు.






ఏప్రిల్ 5న ‘మంకీ మ్యాన్’ విడుదల


దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’కు పాల్ అంగునావేలా, జాన్ కొలీలతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రంలో పటేల్, షార్ల్టో కోప్లీ, పిటోబాష్, శోభితా ధూళిపాళ, సికందర్ ఖేర్, విపిన్ శర్మ, అశ్విని కల్సేకర్, అదితి కల్కుంటే, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషించారు. ‘మంకీ మ్యాన్’ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా అమెరికాలో ఈ చిత్రం విడుదలకానుంది.  


Read Also: అనంత్ అంబానీకి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే - కళ్లు తిరుగుతాయ్ జాగ్రత్త!