Upasana Konidela: మెగా కోడలిగా ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వకముందే ఉపాసన కొణిదెలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన తాత ప్రతాప్ రెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకోవడమే కాకుండా సోషల్ వర్కర్‌గా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. తాజాగా తన తాతయ్య కథ అందరికీ తెలియాలని ‘ది అపోలో స్టోరీ’ అనే బుక్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ బుక్‌ను లాంచ్ చేయడానికి గల కారణాన్ని చెప్తూ.. మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు ఉపాసన. దాని వెనుక రానా హస్తం ఉందని బయటపెట్టారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కూడా తెలిపారు.


ముందుగా రానా దగ్గరకు వెళ్లాను..


ముందుగా తనకు ‘ది అపోలో స్టోరీ’ అనే పుస్తకాన్ని ప్రజలకు అందించాలని ఆలోచన వచ్చిన వెంటనే రానా దగ్గరకు వెళ్లానని చెప్పారు ఉపాసన. ‘‘నాకు తాత కథను అందరికీ చెప్పడానికి సాయం చెయ్యి. ఎందుకంటే యంగ్ అమ్మాయిలకు ఇది ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలి. చాలామంది అమ్మాయిలు హెల్త్ సెక్టార్‌లోకి రావడం లేదు. వ్యాపారవేత్తలు అవ్వడానికి భయపడుతున్నారు. కూతుళ్ల కోసం మాత్రమే కాదు.. తండ్రుల కోసం కూడా మనం ఈ కథను చెప్పాలి అని రానాతో అన్నాను. తండ్రులతో కొడుకులపై ఉన్నంత నమ్మకం కూతుళ్లపై ఉండదు. అప్పుడే పూర్తిస్థాయి పుస్తకంలా కాకుండా కామిక్ బుక్‌లాగా విడుదల చేస్తే మంచిదని రానా సలహా ఇచ్చాడు’’ అంటూ ‘ది అపోలో స్టోరీ’ పుస్తకం విషయంలో రానా పాత్ర ఎంత ఉందో బయటపెట్టారు ఉపాసన.


అప్పుడే దేశం మారుతుంది..


ఎక్కువమంది అమ్మాయిలు పనిచేయాలని, తమ కాళ్లపై తాము నిలబడాలని చెప్పడమే ‘ది అపోలో స్టోరీ’ లక్ష్యమని ఉపాసన తెలిపారు. అలా జరిగినప్పుడే దేశం మారుతుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు అంతే కాకుండా త్వరలోనే అన్ని భాషల్లో ఈ పుస్తకం లాంచ్ అవుతుందని రివీల్ చేశారు. ఆ తర్వాత కొన్ని హెల్త్ టిప్స్ చెప్పమని ఉపాసనను అడగగా.. ‘‘నేను టిప్ ఇచ్చేంత అర్హురాలిని కాదు. నాకు ఉపయోగపడేది నీకు ఉపయోగపడకపోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మనం ఎదుర్కుంటున్న సమస్య అదే. ఇన్‌ఫ్లుయెన్సర్ ఏవేవో టిప్స్ ఇస్తుంటారు. అది మీకు కరెక్ట్ కాకపోవచ్చు. మీ శరీరం వేరేలాగా ఉంటుంది’’ అంటూ టిప్స్ ఇవ్వనంటూ తేల్చిచెప్పారు ఉపాసన కొణిదెల. 


విజయ్ డైనమిక్ నిర్ణయం తీసుకున్నారు..


రాజకీయాల గురించి తమ కుటుంబంలో ఎక్కువగా చర్చలు జరగవని బయటపెట్టారు ఉపాసన. తనకు రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పారు. ‘‘రాజకీయ నాయకుల ఉద్దేశం మంచిదైతే.. దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతాను. వారంతా ప్రజలను ఇన్‌స్పైర్ చేయాలి. వాళ్లపై నమ్మకంతోనే ప్రజలు ఓటు వేస్తారు. అందుకే ఓటర్ల నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయకూడదు. ప్రజలను సంతోషంగా ఉంచాలని లీడర్లకు కూడా తెలుసు. ఏ పార్టీకి ఓటు వేసామన్నది కాదు.. మనిషికి మనిషి సాయం చేస్తేనే ఒకటిగా విజయం సాధిస్తాం’’ అని రాజకీయాల గురించి మాట్లాడారు. తమిళ హీరో విజయ్.. రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుండగా.. అది చాలా డైనమిక్ నిర్ణయం అని కామెంట్ చేశారు ఉపాసన. సినిమాల్లో ఎలాగైతే సక్సెస్ సాధించాడో.. రాజకీయాల్లో కూడా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.


Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్‌లో రామ్ చరణ్!?