తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఉదయనిధి కామెంట్స్ పై నిరసనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ బాధ్యత రాహితంగా మాట్లాడాలంటూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెట్టారు.


మరోవైపు సోషల్ మీడియాలో ఈ విషయమై స్టాలిన్ ని నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్..' డెంగ్యూ, మలేరియా ఎలాగో సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు. దాన్ని నిర్మూలించాలి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓవైపు హిందూ సంఘాలు, మరోవైపు సినీ జనాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


ఇదే సనాతన ధర్మం గురించి 2020లో రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా.. ‘‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. భారతీయ కల్చర్ మ్యాటర్స్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తల్లి సురేఖ తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోని సైతం షేర్ చేశారు. ఉదయం నిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ చరణ్ పాత ట్వీట్ ని ప్రస్తుతం నేటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సనాతన ధర్మం పట్ల సీఎం కొడుకు అభిప్రాయం, చిరంజీవి కొడుకు అభిప్రాయం ఎలా ఉన్నాయో చూడండి? అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.


అంతేకాదు సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లే ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వెళ్లారని, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ, ఉదయినిది స్టాలిన్ ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఇంత వివాదం చెలరేగుతున్నా ఉదయనిధి స్టాలిన్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, బిజెపి వాళ్లే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారంటూ ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.


కాగా ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ గా 'మామన్నన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో మంచి సక్సెస్ అవడంతో తెలుగులో 'నాయకుడు' పేరుతో రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కమెడియన్ వడివేలు అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.


Also Read : కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న డబ్బింగ్ కింగ్, పాన్ ఇండియా రేంజిలో ఫస్ట్ మూవీ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial