టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంది. గత కొన్ని రోజులుగా వరుసగా పలువురు నటీనటులను విచారిస్తోంది. బుధవారం సినీనటి ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందుకున్న ముమైత్ ఈ రోజు హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. ముంబై నుంచి ఆమె విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ్నించి నేరుగా ఈడీ ఆఫీసుకు వచ్చింది. అధికారులు విచారణ ప్రారంభించారు.
ముమైత్ నుంచి డ్రగ్ పెడ్లర్ కెల్విన్ కు భారీగా డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి ఇప్పటివరకు ముమైత్ పేరు మీదున్న బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని రావాల్సిందిగా ముమైత్ కు ముందే ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో కూడా ముమైత్ ను ఈడీ దాదాపు ఆరుగంటల పాటూ విచారించింది. మనీలాండరింగ్ చుట్టూనే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ కొనుగోలు చేశారన్న ఆరోపణలతో గత నెల చివరి వారంలోనే 12 మంది తెలుగు సినీనటులకు నోటీసులు అందించింది ఈడీ. ముమైత్ కన్నా ముందు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్ లను ప్రశ్నించింది. సోమవారం నవదీప్ ను 9 గంటల పాటూ అధికారులు ప్రశ్నించారు. అతని బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, కెల్విన్ తో పరిచయం... ఇలా చాలా విషయాల గురించి ఆరా తీశారు. నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ మేనేజర్ విక్రమ్ ను కూడా విచారించారు. అంతకుముందు హీరో రవితేజ, అతని కారు డ్రైవర్ ను కూడా ప్రశ్నించారు.
ఎక్సైజ్ శాఖ్ దర్యాప్తు ఆధారంగా డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పై ఆరు నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం కెల్విన్ లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ అధికారులు నటీనటులకు నోటీసులు పంపినట్టు సమాచారం.
Also read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
Also read: త్రివిక్రమ్ బ్యానర్ లో జాతిరత్నం... నిర్మాత ఎవరంటే...
Also read: సుధారెడ్డి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగందం... అసలు ఎవరీమె?