2023 ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చి ఉంటుంది. కానీ 2023 డిసెంబర్‌లో జరిగిన సినిమా పండగ.. అంతకు ముందు విడుదలయిన సినిమాలను మర్చిపోయేలా చేసింది. డిసెంబర్ నెలలో తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి. అందులో ఒకటి ‘యానిమల్’. కొన్నాళ్ల పాటు సందీప్ రెడ్డి వంగా క్రియేట్ ‘యానిమల్’ అనే మ్యాజిక్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకోయారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. తోటి దర్శకులు కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. తాజాగా కొందరు దర్శకులు కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘యానిమల్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మతిపోగొట్టింది
ఈ ఏడాది విడుదలయిన అన్ని చిత్రాల్లో మీ మతి పోగొట్టిన సినిమా ఏంటి అని దర్శకులకు ప్రశ్న ఎదురయ్యింది. ముందుగా ‘బలగం’ ఫేమ్ వేణు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందుకొచ్చాడు. ‘‘మతిపోగొట్టింది అని చెప్పాలంటే నాకు యానిమల్ నచ్చింది. ఒకవారం పాటు ఆ ట్రాన్స్‌లో ఉండిపోయాను. ఇలా ఉండాలి కదా సినిమా అని అనుకున్నాను’’ అని వేణు చెప్తుండగా.. మధ్యలో అనిల్ రావిపూడి జోక్యం చేసుకున్నాడు. ‘‘ప్రతీ ఒక్కరిలో యానిమల్ ఉంటాడని ఆయన చెప్పారు కదా. ‘బలగం’ తీసిన ఈయనలో కూడా ఒక యానిమల్ ఉన్నాడు’’ అంటూ జోకులు వేశాడు. దానికి నవ్వుకున్న వేణు.. అసలు ‘యానిమల్’ సినిమా తనకు ఎందుకు నచ్చిందో చెప్పడం మొదలుపెట్టాడు.
నా వర్క్‌కు గౌరవం ఇవ్వాలి
‘‘రూల్స్ బ్రేక్ చేసి.. రెండున్నర గంటలే ఉండాలి, రెండు గంటల పది నిమిషాలే ఉండాలి అంటే కాదని ఆయన ఏదైతే అనుకున్నాడో.. అచ్చం అదే చేశాడు. హీరో రాగానే ఇది పెట్టాలి, అది పెట్టాలి అని ఏం చూడలేదు ఆయన. ఇంటర్వెల్ బ్లాక్‌లో అంత పెద్ద ఫైట్ చేసి కొన్ని దెబ్బలు తగిలితే ఒక మనిషి ఎంత డ్యామేజ్ అవుతాడని దానిపైనే స్టోరీని నడిపించాడు. అద్భుతం అనిపించింది. క్లైమాక్స్‌లో అంత వైలెంట్ ఫైట్ పెట్టి ఒక ఎమోషనల్ సాంగ్‌పై ఎలాంటి ఆర్ఆర్ లేకుండా చేశాడు’’ అంటూ సందీప్‌ను ప్రశంసించాడు వేణు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అయితే ముందుగా తాను తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ తనకు ఇష్టమని, లేకపోతే తన వర్క్‌కు తాను గౌరవం ఇచ్చినట్టుగా ఉండదని అన్నాడు. దాని తర్వాత ‘బలగం’, ‘యానిమల్’ తనకు విపరీతంగా నచ్చాయని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత నిద్రపట్టలేదు
‘‘దర్శకత్వంలో రెండు కోణాలను చూశాను ఈ సంవత్సరం. అందులో ఒకటి బలగం. ఆర్గానిక్‌గా, ఫ్యామిలీకి సంబంధించిన ఒక హెల్తీ సినిమా బలగం. మరొకటి యానిమల్. అది చాలా క్రేజీ స్టఫ్. రెండు కోణాలు చూసి నేను కన్‌ఫ్యూజ్ అయిపోయా తరువాత ఏం చేయాలా అని’’ అని అనిల్ రావిపూడి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని టర్న్ వచ్చింది. ‘‘నన్ను కొంచెం మ్యాడ్ చేసింది యానిమల్. ఒక డైరెక్టర్‌కు ఉండే మ్యాడ్ గట్స్ నచ్చాయి. కొన్ని సినిమాలు చూస్తే ఇంటికి వెళ్లిన తర్వాత నిద్రపట్టదు. అలాంటి సినిమాల్లో యానిమల్ ఒకటి. ఎందుకు నిద్రపట్టదు అంటే అలా తీశాడేంటి అని ఒక ఆలోచన ఉండిపోతుంది. డైరెక్టర్లు ఆ ఆలోచన మరీ ఎక్కువగా ఉంటుంది’’ అని గోపీచంద్ మలినేని అన్నాడు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ కూడా తనకు ‘యానిమల్’ నచ్చిందని, అందులోని రైటింగ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు.
Also Read: అరే.. ఇదంతా ఎలా జరిగింది, ఇదే కదా కావాలనుకుంది - రష్మిక ఆసక్తికర పోస్ట్