Nandi Awards In Telangana: వచ్చే ఉగాది (Ugadi) నుంచి నంది (Nandi)అవార్డులను ప్రకటిస్తామని తెలంగాణ (Telangana)సినిమాటోగ్రఫీ (Cinemautography)మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)హామీ ఇచ్చారు. సీనియర్ నటుడు మురళీ మోహన్(Muralai Mohan) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన, నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటులకు అవార్డులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్న కోమటిరెడ్డి, ప్రాంతాలకు అతీతంగా ఉత్తమ నటులకు అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు.


నంది అవార్డుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఒప్పిస్తానన్నారు కోమటి రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. నంది అవార్డుల ప్రకటనపై మురళీ మోహన్ లాంటి నటుల సలహాలు తీసుకుంటామన్నారు. కొత్త ఏడాది సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని అన్నారు.


మురళీ మోహన్ పై ప్రశంసలు


మురళీమోహన్ ను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. సినిమా నటుడే కాకుండా మంచి వ్యక్తిగా, పార్లమెంట్ సభ్యుడిగా చూశానన్నారు. రియల్ జీవితంలో ఆయన ఎంతో మందికి రోల్ మోడల్ అని అన్నారు. సినిమా రంగానికి పూర్తి సహాకారం అందిస్తామని, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


నంది అవార్డులు ఇవ్వాలన్న మురళీ మోహన్


అంతకుముందు మాట్లాడిన మురళీ మోహన్... నంది అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు...సినీ, టీవీ, నాటక రంగాల నటులకు అవార్డులు ఇచ్చి ప్రొత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక ఎలాంటి అవార్డులు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో అవార్డులు ఇవ్వాలని భావించినా, కార్యరూపం దాల్చలేదన్నారు.  కళాకారులను ప్రొత్సహింస్తే రాష్ట్రం అన్ని రకాల బాగుంటుందని మురళీ మోహన్ అన్నారు. నంది అవార్డుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి కోమటిరెడ్డిని కోరారు. 


తెలుగు సినిమా రంగంలో నంది అవార్డుకు ప్రతిష్టాత్మక అవార్డుగా పేరున్నప్పటికీ, ఐదేళ్లుగా దానిపై ఎలాంటి ఊసు లేదు. 2017లో చివరిసారి  నంది అవార్డులు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు సినీ, టీవీ, నాటక రంగాలకు అవార్డులు విషయాన్ని పక్కన పెట్టేశాయి.