మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందనున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic). ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా కథానాయికగా నుపుర్ సనన్‌ను ఎంపిక చేశారు. తెలుగులో 'వన్ నేనొక్కడినే', 'దోచెయ్' సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కృతి సనన్‌కు నుపుర్ సొంత చెల్లెలు.


'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నుపుర్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇంతకు ముందు హిందీలో అక్షయ్ కుమార్‌కు జోడీగా ఒక మ్యూజిక్ వీడియోలో ఆమె నటించారు. ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా కనిపించనున్న 'నూరాని చెహ్రా' చిత్రీకరణ పూర్తి చేశారు. అది కథానాయికగా ఆమెకు తొలి హిందీ సినిమా.


తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి వంశీ దర్శకుడు. ఉగాదికి చిత్రాన్ని ప్రారంభించి, అదే రోజు ప్రీ లుక్ విడుదల చేయనున్నారు. 'ది కాశ్మీర్ ఫైల్స్'తో భారీ విజయం అందుకున్న అభిషేక్ అగర్వాల్, ఆ సినిమా తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది.


Also Read: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్


1970వ దశకంలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్: శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.


Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!