తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు అయితే.. ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు మూల స్థంభాలుగా నిలిచారు. ఎవరి శైలిలో వాళ్ళు మూవీస్ చేస్తూ, తెలుగు సినిమా అభివృద్ధికి కృషి చేసారు. వీరిలో ఏఎన్నార్, శోభన్ బాబు కేవలం సినిమాలకే పరిమితం అవ్వగా, మిగతా వారు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రాజకీయాల విషయంలో కృష్ణ ఒకానొక దశలో ఎన్టీఆర్ తో విభేదించారు. పలు మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ.. వేర్వేరు పొలిటికల్ పార్టీలలో ఉండటం వల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయి. 


నాగేశ్వరరావు, రామారావు స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చిన కృష్ణ.. 'స్త్రీ జన్మ' చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఇందులో తమ్ముడి పాత్రలో నటించడంతో ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలవడం కృష్ణకు అలవాటైంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడంతో, 'నిలువు దోపిడి' చిత్రంలో తన తమ్ముడి పాత్రకు కృష్ణను రికమెండ్‌ చేశారు ఎన్టీఆర్‌. ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతున్న సమయంలోనే వీరి కలయికలో 'దేవుడు చేసిన మనుషులు' (1973) సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ కి ఎన్టీఆర్‌ రాలేదు. దీనికి కారణం 'అల్లూరి సీతారామరాజు' సినిమా చేస్తున్నట్లు కృష్ణ ప్రకటించడమే. 
 
ఎన్నో విలక్షణమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన రామారావు.. అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించాలని కోరుకున్నారు. కానీ ఉన్నట్లుండి తాను అల్లూరి చిత్రం తీయబోతున్నట్లు కృష్ణ అనౌన్స్ చేసారు. దీంతో ఎన్టీఆర్‌ కు కృష్ణ మీద కోపం వచ్చి, 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఫంక్షన్‌ కి హాజరుకాలేదు. అలానే ఎన్టీఆర్‌ నటించిన 'దాన వీర శూర కర్ణ' సినిమా సమయంలోనే, కృష్ణ 'కురుక్షేత్రం' మూవీ తెరకెక్కించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ముగిసి ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ (1982) చిత్రంలో కలిసి నటించారు.


ఇదే క్రమంలో కృష్ణ నటించిన ‘ఈనాడు’ (1982) సినిమా ఎన్టీఆర్ పార్టీకి అనుకూలంగా ఉందని.. ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు తోడ్పడిందని అప్పట్లో అందరూ భావించారు. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. అయితే 1984లో ఉమ్మడి ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వారి మధ్య గ్యాప్ వచ్చిందంటారు. రామారావు ప్రభుత్వాన్ని కూల్చేసి నాదెండ్ల భాస్కరరావు సీఎం పదవిని దక్కించుకున్న టైములో, నాదెండ్లను అభినందిస్తూ కృష్ణ ప్రకటన ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 


ఇక ఇందిరా గాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీతో కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ కు కూడా సినీ గ్లామర్ అవసరమని భావించిన రాజీవ్.. కృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ.. 1989లో కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. అప్పుడే వంగవీటి రంగా హత్య నేపథ్యంలో విజయ నిర్మల దర్శకత్వంలో 'సాహసమే నా ఊపిరి' అనే సినిమా తీసి ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారు. అయితే 1991 లోక్‌ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు కృష్ణ. ఆ తర్వాత ఎన్టీఆర్ - కృష్ణలు మళ్ళీ దగ్గరయ్యారు. రామారావు మరణించే వరకు కూడా మంచి సంబంధాలు కొనసాగాయి. 


ఎన్టీఆర్ తో విబేధాలు ఎందుకు వచ్చాయనే దానిపై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వివరణ ఇచ్చారు. తాను 'అల్లూరి సీతారామరాజు' సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం వల్లనే అలా జరిగిందని చెప్పారు. ''పీవీ నరసింహారావు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్రాలో కరువు వచ్చింది. అప్పుడు సినీ ఇండస్ట్రీ తరపున కరువు సహాయార్థం కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసాం. రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన బెజవాడ ఫంక్షన్ లో 'పండంటి కాపురం' సినిమా 100 రోజుల వేడుక చేసాం. ఆ వేదిక మీదే నా నెక్స్ట్ మూవీ రామారావు గారితో తీస్తానని ప్రకటించాను. ఆయన స్వయంగా ఫోన్ చేసి, సినిమా ఎప్పుడు మొదలెడతావ్ అని అడిగారు. అప్పుడు నేను ద్విపాత్రాభినయం చేయాలని రాసుకున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమాని ఆయనతో కలిసి చేశా'' అన్నారు.


''ఆ సమయంలోనే నేను 'సీతారామరాజు' సినిమా చేద్దాం అని కథ రాయించాను. అప్పుడు రామారావు గారు పిలిచి అడిగారు. 'మీరు తీస్తా అంటే మానేస్తాను' అని చెప్పాను. ఆయన మాత్రం 'బ్రదర్.. నేను తీయను.. మీరు కూడా తీయొద్దు' అని చెప్పారు. 'అది కాషాయ వస్త్రాలు వేసుకుని అడవుల్లో తిరిగే సన్యాసి వేషం, ఒక పాట ఫైటు డ్యూయెట్ లేదు. ఏం చూడటానికి జనాలు ఈ సినిమాకి వస్తారు?' అని ఆయనే అన్నారు. అయితే 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తారకరామ ఫిలిమ్స్ వారి దగ్గర ఓవర్ ఫ్లోస్ ఉన్నాయి కదా.. పోతే పోయిందిలే అని సీతారామరాజు సినిమా ప్రకటించాను. దీంతో ఆయనకు కోపం వచ్చి 'దేవుడు చేసిన మనుషులు' 100 డేస్ ఫంక్షన్ కు కూడా రాలేదు. అప్పటి నుంచి పదేళ్లు నాతో మాట్లాడలేదు'' అని కృష్ణ చెప్పుకొచ్చారు.