సూర్య అజాత శత్రువు. తెరపై ఆయన నటనకు, జీవితంలో ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులుగా మారారు. సూర్యను ఇష్టపడే వ్యక్తులలో విజయ్ దేవరకొండ ఒకరు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కానీ, స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ కనిపిస్తే సూర్య గొంతు వినిపించనుంది. ఆ మ్యాజిక్ ఏమిటి? అంటే...

విజయ్ దేవరకొండకు సూర్య డబ్బింగ్!అవును... మీరు చదివినది నిజమే! విజయ్ దేవరకొండకు సూర్య డబ్బింగ్ చెప్పారు. అయితే... అది తెలుగులో కాదు తమిళంలో! విజయ్ దేవరకొండ నటనకు సూర్య గొంతు వినిపిస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని కోరుకునే ప్రేక్షకులు తెలుగులో కాకుండా తమిళంలో 'కింగ్‌డమ్‌' సినిమా చూడాలి. 

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'మళ్లీ రావా', 'జెర్సీ' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కింగ్‌డమ్‌'. మే 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది. తమిళంలో విజయ్ దేవరకొండకు డబ్బింగ్ చెప్పినట్టు సూర్య తెలిపారు. 

సూర్య హీరోగా నటించిన 'రెట్రో' సినిమాను తెలుగులో‌ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' నిర్మాత కూడా ఆయనే. అంతే కాదు... సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను సైతం ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో పాటు నాగ వంశీ కోసం సూర్య డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

Also Readకశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ

'గజినీ' చూశాక సూర్యతో ప్రేమలో పడ్డా!'గజినీ' సినిమా చూశాక సూర్యతో ప్రేమలో పడినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు ఆయన సినిమా ప్రమోషన్ కోసం తాను రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇంకా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''నేను 'గజిని' చూసిన తర్వాత 'ఎవర్రా ఈయన? ఇంత బాగా నటిస్తున్నాడు' అనుకున్నాను. ఆయన నటించిన మిగతా సినిమాలన్నీ చూశా. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' నా మనసుకు బాగా నచ్చిన సినిమా. అందులోని 'చంచల' పాట చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పాట నాకు ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకం. స్క్రీన్ మీద సూర్య అన్నను చూసి 'ఈ మనిషి ఏంటి? యాక్టింగ్ ఏంటి? డాన్స్ ఏంటి? ఒక్కసారి అయినా జీవితంలో ఈ మనిషిని కలవాలి' అనుకున్నాను. ఆయనతో ఇలా ఒక వేదిక మీద ఉండడం ఎప్పటికీ మర్చిపోలేను. నటులలో స్ఫూర్తి నింపేలా సూర్య సినిమాలను ఎంపిక చేసుకుంటారు. ఆయన నటించిన 'రెట్రో' ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు సైతం సూర్య అండగా నిలబడుతున్నారు'' అని చెప్పారు.

Also Read: ఇట్స్ అఫీషియల్... వెంకీ అట్లూరితో సినిమా అనౌన్స్ చేసిన సూర్య