ఇంగ్లీష్‌లో హారర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. హాలీవుడ్ వారు తెరకెక్కించినట్టుగా హారర్ సినిమాలు ఇంకా ఏ ఇండస్ట్రీ తెరకెక్కించలేదు అనే గుర్తింపు ఉంది. అలాంటి హారర్ సినిమాల్లో ఒకటి ‘ది నన్’. ఒక నన్ పాత్రను దెయ్యంగా చూపించి ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం చట్టపరమైన కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. మేకర్స్ తనను మోసం చేశారంటూ ‘ది నన్’ నటి బోనీ ఆరోన్స్ కోర్టుకెక్కింది. అసలు సినిమాకు ఎంత లాభం వచ్చింది? దానిలో తనకు రావాల్సిన షేర్ ఏంటి అన్న విషయాల్లో ప్రొడక్షన్ కంపెనీ వార్నర్ బ్రోస్ తనను మోసం చేశారంటూ కోర్టులో దావా వేసింది బోనీ.


ప్రపంచవ్యాప్తంగా 365 మిలియన్ డాలర్ల కలెక్షన్స్..
‘ది నన్’ సినిమాలో నటించినందుకు బోనీ ఆరోన్స్‌కు 71,500 డాలర్లు రెమ్యునరేషన్‌లాగా అందాయి. 22 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మొత్తంగా 365 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను సాధించింది. అయితే బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ బాగుంటే బోనీ ఆరోన్స్‌కు 175,000 డాలర్లు అదనంగా వస్తాయని ముందుగా వార్నర్ బ్రోస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ‘ది నన్’ సినిమా బోనీ ఆరోన్స్ పాత్రపైనే ఆధారపడి ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ను అడ్డం పెట్టుకొని మేకర్స్.. అన్ని కలెక్షన్స్ సాధించినా.. లాభాల్లో తనకు ఏ మాత్రం వాటా ఇవ్వలేదనేది బోనీ ఆరోపణ. సరైన పద్ధతిలో బోనీ ఆరోన్స్‌కు వార్నర్ బ్రోస్ లాభాల్లో వాటా ఇవ్వలేదని, పైగా అసలైన లాభాల లెక్కలను తన నుంచి దాచిపెట్టారని లా సూట్‌లో పేర్కొన్నారు.


కాంట్రాక్ట్‌కు కట్టుబడలేదు..
తాజాగా లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టులో ఈ లా సూట్ ఫైల్ అయ్యింది. బోనీ ఆరోన్స్ చూపించిన అగ్రిమెంట్ ప్రకారం.. తను వచ్చిన మొత్తం కలెక్షన్స్‌లో 5 నుంచి 50 శాతం వరకు షేర్ పొందవచ్చు అని రాసుంది. అయితే అనుమానం వచ్చిన బోనీ ఆరోన్స్.. ‘ది నన్’ లాభాలను చూపించమని వార్నర్ బ్రోస్‌ను నిలదీయగా.. వారు తనకు తప్పుడు లెక్కలు పంపించారని ఆరోపిస్తోంది. అందుకే తాను కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించిండం, నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం వంటిని ఆధారితంగా తీసుకొని వార్నర్ బ్రోస్‌పై కేసు పెట్టింది. ఈ లా సూట్‌లో కేవలం వార్నర్ బ్రోస్ పేరు మాత్రమే కాకుండా న్యూ లైన్ సినిమాస్, స్కోప్ ప్రొడక్షన్స్ వంటి ప్రొడక్షన్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. 


అయిదేళ్లు అయినా..
ముందుగా ‘కంజ్యూరింగ్’ అనే చిత్రంలో నన్ పాత్రను క్రియేట్ చేశారు మేకర్స్. ఆ క్యారెక్టర్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో దానినే మరో ప్రత్యేకమైన కథగా రాసుకొని ‘ది నన్’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ‘ది నన్’లో నటించిన ప్రతీ ఒక్కరికి లాభాల నుంచి వాటా వెళ్లిందని, తనకు మాత్రమే రాలేదని బోనీ ఆరోన్స్ ఆరోపణలు చేస్తోంది. బోనీ ఆరోన్స్ చేస్తున్న ఆరోపణలకు ఇంకా వార్నర్ బ్రోస్ కానీ, న్యూ లైన్ కానీ ఏ విధంగా స్పందించలేదు. హాలీవుడ్‌లోని ఫేమస్ ఫ్రాంచైజ్ ‘కంజ్యూరింగ్’ యూనివర్స్ నుంచి వచ్చిన ‘ది నన్’ విడుదలై అయిదేళ్లు అయినా ఇప్పటికీ దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ నచ్చి మళ్లీ మళ్లీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు.


Also Read: ముద్దు ఎవరికి పెట్టారు అంటూ జర్నలిస్ట్ ప్రశ్న - యాంకర్ రష్మీ షాకింగ్ రిప్లై


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial