పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్రో'. మామా అల్లుళ్లు తొలిసారిగా కలసి నటిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన పవన్, సాయి తేజ్ కలిసున్న ఫోటో కూడా ఆకట్టుకుంటోంది.


'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే దేవుడు అనగానే అందరూ అనుకునే తరహలో కాకుండా, మోడరన్ గాడ్ గా చాలా స్టైలిష్ గా ఆయన పాత్ర ఉండబోతోంది. ఫస్ట్ లుక్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇందులో పవన్ స్టైలింగ్, కాస్ట్యూమ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయన వేసుకున్న షూ బాగా ఆకర్షించాయి.


దేవుడు షూ వేసుకుంటాడా లేదా అనే లాజిక్ ను పక్కన పెడితే, 'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ షూ వేసుకుని కనిపించాడు. ఫస్ట్ లుక్ లో స్నేక్ షేప్ లో డిజైన్ చేయబడిన బ్లాక్ కలర్ షూ ధరించగా, ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ఫోటోలో ట్రెండీ షోలో దర్శనమిచ్చాడు. ఇవి అభిమానులకు బాగా నచ్చేశాయి. పవన్ స్టయిలింగ్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్, ముచ్చటపడి వాటిని కొనుక్కోవాలని గూగుల్ లో సెర్చ్ చేస్తే, రేట్ చూసి షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది.


పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఖరీదైన బూట్లను మేకర్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ వేసుకున్న కోబ్రాస్ స్నీకర్స్ ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు. ఇటలీకి చెందిన గియుసేప్ జానోట్టి బ్రాండ్ లెదర్ షూ ఇది.


అలానే రీసెంట్ ఫోటోలో పవన్ ధరించిన షూ ఖరీదు కూడా లక్ష రూపాయలకు పైనే ఉంది. పారిస్ కు చెందిన బాల్మేన్ కంపెనీ లెదర్ షూ ఇది. దీని కాస్ట్ ₹1,06,870 (€1,207) అని తెలుస్తోంది. ఇవి రెండు కాకుండా దేవుడు బ్రో కోసం మరో రెండు జతల కాస్ట్లీ షూ తెప్పించారట. వీటి ధర కూడా లకారంపైనే ఉంటుందట. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ షూ రేట్స్ గురించే నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. 


కాగా, 'వినోదాయ శితమ్' అనే తమిళ్ చిత్రానికి రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ డైరక్టర్ పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఒక అహంకారికి మరణం తర్వాత తన తప్పులను సరిచేసుకోవడానికి దేవుడు రెండవ అవకాశం ఇవ్వడం అనే లైన్ తో ఈ సినిమా ఉంటుంది. ఇందులో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అలీ రెజా ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న బ్రో చిత్రాన్ని 2023, జులై 28న విడుదల చేయనున్నారు. 


Read Also: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?