Sudipto Sen : డైరెక్టర్ సుదీప్తో సేన్ ఇటీవల తీసిన 'ది కేరళ స్టోరీ' బ్లాక్ బస్టర్ హిట్ ను నమోదు చేసింది. నిషేధాలు, ఎదురుదెబ్బలు, అవాంతరాలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును దాటింది. అయితే పలు ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తోన్న సుదీప్తో సేన్... విపరీతమైన ప్రయాణాల కారణంగా అస్వస్థతకు గురయ్యారు. 


సుదీప్తో సేన్ నిరంతరం ప్రయాణం చేయడం కారణంగా ఆసుపత్రిలో చేరారు. దీంతో పలు నగరాల్లో షెడ్యూల్ లో ఉన్న మూవీ ప్రమోషన్లు నిలిచిపోయాయి. సుదీప్తో సేన్ కోలుకున్న తర్వాత 10 నగరాల్లో 'కేరళ స్టోరీ'ని ప్రచారం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. సుదీప్తో సేన్ బృందంతో కలిసి 'కేరళ స్టోరీ'ని ప్రచారం చేస్తూ నిరంతరం ప్రయాణిస్తున్నాడు. అదనపు ప్రయాణం కారణంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు. అందుకే, ప్రచార ప్రణాళిక, నగర సందర్శనలు నిలిపివేయబడ్డాయని నివేదికలు చెబుతున్నాయి.


మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' రాష్ట్రంలోని ముగ్గురు బాలికలను బ్రెయిన్‌వాష్ చేసి ఇస్లాం మతంలోకి మార్చిన విధానాన్ని చూపుతుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్వానీ నటించారు. సినిమాలో నటీనటుల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.


సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసి, విపుల్ షా నిర్మించిన ఈ సినిమాకు విడుదలకు ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. అంతే కాదు ఈ చిత్రంపై తమిళనాడులో నిషేధం కూడా విధించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆ రాష్ట్రంలో సినిమాను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.264.4 కోట్లు వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం.


పశ్చిమ బెంగాల్‌లో సినిమా నిషేధంపై స్పందించిన సుదీప్తో సేన్.. "ఈ సినిమా కారణంగా రాష్ట్రంలో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. సినిమాపై నిషేధం రాజకీయ ప్రేరేపిత నిర్ణయం. సినిమా చూసి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మమతా బెనర్జీని అభ్యర్థిస్తున్నాను... నేను రాజకీయ నాయకుడిని కాదు, సినిమా నిర్మాతని. నేను సినిమా మాత్రమే తీయగలను, మీరు చూడాలా వద్దా అని మీ నిర్ణయం. నాలుగు రోజుల పాటు కోల్‌కతాలో సినిమా రన్ అయిననప్పుడు ఎటువంటి సమస్య లేదు. అకస్మాత్తుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉండవచ్చని దీదీ భావించారు" అని ఆయన వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా ది కేరళ స్టోరీ నటి ఆదా శర్మ ఇటీవల నెట్టింట వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో తన కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ ఫోన్ నెంబర్ లీక్ చేసి కొందరు వ్యక్తులు తనను తీవ్ర స్థాయిలో వేధిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ఈ న్యూస్ జనాల్లో చర్చనీయాంశం అయింది.


Read Also : Jr NTR - TD Janardhan : శత జయంతి ఒక్కసారే వస్తుందని, పుట్టిన రోజులు మళ్ళీ వస్తాయని రిక్వెస్ట్ చేసినా రాలేదు - టీడీ జనార్థన్