RRRతోపాటు సగర్వంగా ఆస్కార్ అవార్డును అందుకున్న మరో భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’. తమిళనాడులో ఒక మారుమూల గ్రామానికి చెందిన బొమ్మన్, బెల్లీ అనే ఒక వృద్ధ జంట కథే ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’. వారిద్దరూ కలిసి ఎలా ఏనుగులను దత్తత తీసుకున్నారు. ఎలా వాటిని సొంత బిడ్డలుగా పెంచుకున్నారు అనే అంశంపై తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్.. కార్తికి గాన్‌సేల్వ్స్‌కు ఆస్కార్ దక్కింది. తమ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందనే విషయ తెలిసి ఆ జంట కూడా చాలా సంతోషపడ్డారు. అయితే, తాజాగా వారు ఊహించని షాకిచ్చారు. కార్తికిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. లీగల్ నోటీసులు కూడా పంపారు.


పేరొచ్చింది కానీ డబ్బు రాలేదు..
కార్తికి గాన్‌సేల్వ్స్‌కు బొమ్మన్, బెల్లీ పంపిన లీగల్ నోటీసు ప్రకారం.. ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ మేకర్స్ తమకు సరైన ఇల్లు అందిస్తామని, అన్ని రకాలుగా ఉపయోగపడే వాహనాన్ని అందిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని బొమ్మన్, బెల్లీ పేర్కొన్నారు. అయితే వారు ఎంత డబ్బు ఇస్తారు అనే విషయాన్ని మాత్రం అందులో స్పష్టంగా చెప్పలేదు. కానీ రూ.2 కోట్ల వరకు అన్నట్టుగా రాసుంది. డాక్యుమెంటరీ తెచ్చిపెట్టే లాభాలను బట్టి మేకర్స్.. బొమ్మన్, బెల్లీకి రావాల్సిన మొత్తాన్ని డిసైడ్ చేసి ఇస్తారని ఉంది.  ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ద్వారా బొమ్మన్, బెల్లీలు ‘రియల్ హీరోస్’ అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. కానీ సినిమా నుంచి వచ్చిన ఆర్థిక లాభాలు మాత్రం కేవలం మేకర్స్‌కు మాత్రమే అందాయని లీగల్ నోటీసులో ఉంది.


తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి, దేశ ప్రధానమంత్రి నుంచి ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’కు ఆర్థికంగా చాలా లాభాలు వచ్చాయని, కానీ అవేవి వారి వరకు రాలేదని బొమ్మన్, బెల్లీ.. ఈ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై బొమ్మన్‌ స్పందించేందుకు నిరాకరించాడు. ఈ అంశంపై తాను పర్సనల్‌గా కామెంట్ చేయడం ఇష్టం లేదని, ఏదైనా తమ లాయర్స్‌తోనే మాట్లాడుకోమని తెలిపారు. ప్రవీన్ రాజ్ అనే సోషల్ యాక్టివిస్ట్, లాయర్ వారికి సాయం చేసినట్లు సమాచారం. అతడే వీరిద్దరినీ చెన్నైలోని ఒక మంచి లా సంస్థ దగ్గరికి తీసుకెళ్లి, వారికి కావాల్సిన లీగల్ సాయాన్ని అందిస్తున్నట్టు తెలిసింది.


బొమ్మన్, బెల్లీ ఇద్దరూ గాన్‌సేల్వ్స్‌పై నిరాశతో ఉన్నారని, ఆమె బెల్లీ మనవరాలి చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేస్తానని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చారని ప్రవీన్ అన్నారు. అంతే కాకుండా సినిమాకు ఇన్ని లాభాలు వచ్చినా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గాన్‌సేల్వ్స్ సిద్ధంగా లేదని ఆయన తెలిపారు. ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ మేకింగ్ సమయంలో మేకర్స్ ఏది చెప్తే.. ఈ జంట అదే చేశారని, దీని వల్ల వారికి కూడా లాభం చేకూరుతుందని నమ్మారని చెప్పారు. కానీ ఇప్పుడు బొమ్మన్ ఫోన్లు చేసినా గాన్‌సేల్వ్స్ కనీసం స్పందించడం లేదని బయటపెట్టారు. 


సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ రిప్లై నోటీసు..
బొమ్మన్, బెల్లీకి లాయర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ మన్సూర్.. నాలుగు రోజుల క్రితం తమకు సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి గాన్‌సేల్వ్స్ తరపున రిప్లై నోటీస్ వచ్చిన విషయాన్ని బయటపెట్టారు. అందులో తన గాన్‌సేల్వ్స్‌తో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తామని సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ తెలిపింది. అంతే కాకుండా ఇప్పటికే ఆ జంటకు తగిన సాయం చేశామని, ఇంకా వారికి డబ్బు ఇచ్చేది లేదని చెప్పింది. అంతే కాకుండా ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ అనే డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ఎన్ని మంచి మార్పులకు నాంది పలికిందో గుర్తుచేసుకుంది. ఏది ఏమైనా బొమ్మన్, బెల్లీ మాత్రం తాము అనుకున్నది సాధించే వరకు ఈ లీగల్ పోరును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.


Also Read: పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial