కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన చనిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లగా అక్కడ తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే తను చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. స్పందన అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర బంధువు. 2021లో పునీత్ గుండెపోటుతో చనిపోగా, ఇప్పుడు వారికి కుటుంబానికి చెందిన స్పందన చనిపోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్పందన భౌతికదేహాన్ని రేపు బెంగళూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అభిమానుల సందర్శన అనంతరం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
స్పందన మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి
స్పందన మృతి పట్ల కన్నడ సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. స్పందన అకాల మరణం పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. “ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త షాక్‌కు గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ్ రాఘవేంద్ర, బీకే శివరామ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని సిద్ధరామయ్య తెలిపారు.
స్పందన మృతి పట్ల కర్ణాటక డిప్యూటీ సీఎం నివాళి
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం స్పందన మృతిపట్ల స్పందించారు. తనను కొద్దిరోజుల క్రితం విజయ్ దంపతులు కలిశారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “కన్నడ నటుడు శ్రీ విజయ్ రాఘవేంద్ర భార్య శ్రీమతి స్పందన రాఘవేంద్ర బ్యాంకాక్‌లో ఆకస్మికంగా మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఇటీవల ఆ జంట నన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్పందన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విజయ్ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సానుభూతి.
ప్రేమ వివాహం చేసుకున్న విజయ్, స్పందన
విజయ్, స్పందన 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు. పేరు శౌర్య. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ నాట పెద్ద సంఖ్యలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్పదంన ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అంతేకాదు, ఆమె భర్త నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యహరించింది. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం ‘అపూర్వ’ స్పందన అతిధి పాత్రలో కనిపించింది. ఇక స్పందన భర్త విజయ్ కన్నడనాట పాపులర్ హీరోగా కొనసాగుతున్నారు. 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నారు. సుమారు 50 సినిమాలకు పైగా నటించారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial