Bhumana Karunakar Reddy: టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా నియమితులపై భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మొదటి సారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


ఆలయ వెలుపల భూమనకు భక్తులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు. రెండో సారి టీటీడీ చైర్మన్‌గా నియమితులు కావడం శ్రీవారి ఆశీర్వాద బలమన్నారు. ఈ నెల 8వ తేదీ వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి గడువు ముగియనుంది. 10వ తేదీ టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


అంతకు ముందు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని నూతన పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే పాలకమండలి సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాలకమండలి సమావేశంలో పాల్గొన్నారు. 


టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని చివరి పాలకమండలి సమావేశం సోమవారం ప్రారంభమైంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ప్రారంభంమైన పాలక మండలి సమావేశంలో పాలకమండలి సభ్యులందరూ పాల్గొన్నారు. రేపటితో వైవీసుబ్బారెడ్డి పాలక మండలి గడువు ముగియనుండడంతో నేడు పాలక మండలి సమావేశంలో దాదాపు 75 అంశాలతో కూడిన ఆజెండాని టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. 


ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నిర్వహించనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పాలకమండలి చర్చ జరుగనుంది. ల్యాబ్ ఆధునీకరణకు రూ.5 కోట్లు కేటాయింపుపై చర్చ జరుగనుంది. దాదాపు 1,000 కంప్యూటర్ల కొనుగోలు టెండర్ ఆమోదంపై పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. ఇక పలు ముడి సరుకులు కొనుగోలు, ఇంజనీరింగ్ పనులకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలపనుంది.


రెండో సారి అవకాశం
గతంలో భూమన ఓ సారి 2006 నుంచి 2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్ గా భూమన సేవలు అందించారు. తాజాగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేసే భాగ్యం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. 


రాజకీయ వ్యవహారాలు చూడనున్న వైవీ
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. ఈ నెల 8 తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమనను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ భూమన టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు.