మెగాస్టార్ చిరంజీవి ఒకటి తర్వాత ఒకటి రీమేక్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయంపై ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశగానే ఉన్నారు. అయితే ‘గాడ్‌ఫాదర్’ తర్వాత మరో రీమేక్ చేయడానికి తనను ప్రేరేపించిన సందర్భాలు గురించి చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అది కూడా ‘వేదాళం’ చిత్రాన్నే ఎందుకు రీమేక్ చేశారో కూడా తెలిపారు.


రీమేక్స్ వద్దనుకున్నాను..
త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’. ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో చిరుకు జోడీగా తమన్నా నటిస్తుండగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. అయితే చిరు చివరి చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ కూడా ‘లూసీఫర్’ అనే మలయాళ చిత్రానికి రీమేకే. ఇప్పుడు ‘భోళా శంకర్’ కూడా రీమేక్ కావడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. అయితే ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ సమయంలోనే తాను కూడా ఇంక రీమేక్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నానని చిరు చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో ‘భోళా శంకర్’ స్క్రిప్ట్‌తో నిర్మాత అనిల్ సుంకర తనను కలిశాడని బయటపెట్టాడు.


అందుకే ఒప్పుకున్నాను..
అనిల్ సుంకర.. ‘భోళా శంకర్’ స్క్రిప్ట్‌తో తనను ఒప్పించాడని మెగాస్టార్ బయటపెట్టాడు. ‘లూసీఫర్’ అయిన ఓటీటీలో అందుబాటులో ఉంది కానీ.. ‘వేదాళం’ మాత్రం ఏ ఓటీటీలో కూడా అందుబాటులో లేదని, అది కూడా ఈ రీమేక్ చేయడానికి తను ఒప్పుకోవడానికి ఒక కారణమని చిరు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి, అనిల్ సుంకర కలిసి దర్శకుడు మెహర్ రమేశ్‌ను రంగంలోకి దించారు. ఆయన ‘వేదాళం’కు తగిన మెరుగులు దిద్ది దానిని ‘భోళా శంకర్’గా మార్చారన్నారు చిరంజీవి. ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. ఇది కమర్షియల్ ఆడియన్స్‌ను బాగా అలరించగలదని అనిపిస్తోంది.


‘బ్రో డాడీ’ రీమేక్‌పై అనుమానాలు..
చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా రీమేక్స్‌పైనే ఆధారపడడం తన ఫ్యాన్స్‌కు నిరాశకు గురిచేస్తోంది. బాస్ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అంటే.. ఆ హడావిడి వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ అది రీమేక్ అయిన తెలియగానే చాలామంది ఫ్యాన్స్ సినిమాను చిరుపై అభిమానంతో చూస్తున్నారే తప్పా ఇష్టంతో కాదని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే ఇక రీమేక్స్ వద్దు అనుకున్నాను అంటూ చిరు ఇచ్చిన స్టేట్‌మెంట్.. తన రీమేక్ జర్నీకి చెక్ పెడుతుందా అన్న అనుమానాలను ఫ్యాన్స్‌లో రేకెత్తిస్తోంది. కానీ ఇప్పటికే మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రీమేక్‌లో చిరు, త్రిష కలిసి నటిస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సిందే.!


Also Read: రజినీకాంత్ చేసిన పనికి కన్నీళ్లు వచ్చాయి: ‘జైలర్’ అనుభవాన్ని గుర్తుచేసుకున్న జాకీ ష్రాఫ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial