Thangalaan teaser review : విలక్షణ కథానాయకుడు, క్యారెక్టర్ కోసం తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకునే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'తంగలాన్'. దీనికి పా రంజిత్ దర్శకుడు. 


'అట్టకత్తి', 'మద్రాస్', సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాల', 'కబాలి', 'సార్ పట్ట' చిత్రాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న దర్శకుడు పా రంజిత్. ఆయనకు చెందిన నీలమ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. 


స్వేచ్ఛకు దారి తీసిన రక్తపు యుద్ధాలు  
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'తంగలాన్' సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆల్రెడీ విడుదలైన విక్రమ్ గెటప్, ఆయన స్టిల్స్ ఆసక్తి పెంచాయి. అయితే... ఈ రోజు విడుదలైన 'తంగలాన్' టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయని చెప్పాలి. 


మాటల్లేవ్... 'తంగలాన్' టీజర్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ టీజర్ చూశాక... ప్రేక్షకుల నోటి నుంచి మాటలు రావని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. వాగులో నీళ్ళల్లో పారిన రక్తం కావచ్చు... పామును విక్రమ్ రెండు భాగాలుగా చేయడం కావచ్చు... ఆ యుద్ధ సన్నివేశాలు కావచ్చు... ప్రతిదీ కళ్లప్పగించి చూసేలా ఉన్నాయి. 


బ్రిటీషర్లు మన దేశానికి రావడం నుంచి రాజులతో యుద్ధాలను కూడా పా రంజిత్ చూపించారు. టీజర్ చివరిలో బంగారు గనులను విక్రమ్ చూసే దృశ్యం ఉంది. 'స్వార్థం వినాశనానికి దారి తీస్తుంది, రక్తపు యుద్ధాలు స్వేచ్ఛకు దారి తీస్తాయి' అని కొటేషన్స్ కూడా పేర్కొన్నారు. బ్రిటీషర్లపై విక్రమ్ తన తెగతో కలిసి రక్తపు యుద్ధం చేశారని భావించవచ్చు.   


Also Read : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' విడుదల వాయిదా - అసలు కారణం ఏమిటంటే?






రిపబ్లిక్ డే కానుకగా 'తంగలాన్' విడుదల
'తంగలాన్' సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు గతంలోనే ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  


చియాన్ విక్రమ్ హీరోగా పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఎస్ఎస్ మూర్తి, కూర్పు : ఆర్కే సెల్వ, స్టంట్స్ : స్టన్నర్ సామ్, నిర్మాణ సంస్థలు : స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాత : కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం : పా రంజిత్.


Also Read  వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమాపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ - దీపావళి బాక్సాఫీస్ బరిలో నుంచి వెనక్కి వెళ్లిన 'ఆదికేశవ'