2023 సంవత్సరంలో అప్పుడే రెండు నెలలు పూర్తి అయ్యాయి. ఈ రెండు నెలల్లో చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’, ‘సార్’ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి కొన్ని సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. ఫిబ్రవరి నెలలో వచ్చిన చిత్రాలపై సినీ ప్రేమికులు చాలా ఆశలు పెట్టుకున్నా... ‘సార్‌’‌తో పాటు ఒకటి రెండు సినిమాలు మాత్రమే కాస్త జనాలను మెప్పించగలిగాయి. మార్చి నెల పరీక్షల సీజన్ అవ్వడం వల్ల సినిమాలకు అన్‌ సీజన్‌ అంటూ ఉంటారు. అయినా కూడా ఈ నెలలో దాదాపుగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలోనే నాని నటించిన ‘దసరా’, ఉపేంద్ర చిత్రం ‘కబ్జా’, విశ్వక్‌ సేన్ ‘ధమ్కీ’ ఇంకా పలు సినిమాలు రాబోతున్నాయి. మార్చి నెలలో రాబోతున్న మొత్తం సినిమాలు.. వాటి విడుదల తేదీలను ఇప్పుడు చూద్దాం. 


బలగం, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు - మార్చి 3


మార్చి నెల 'బలగం' సినిమాతో ప్రారంభం కాబోతుంది. దిల్‌ రాజు ఈ సినిమాకు నిర్మాత అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ సినిమాకు సీనియర్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌ లు ప్రధాన పాత్రలో నటించిన బలగం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకునే విధంగా... గత స్మృతులను తట్టిలేపే విధంగా ఉంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మార్చి 3వ తారీకున బలగం విడుదల కాబోతుంది. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మృణాళిని రవి జంటగా నటించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ మూవీ కూడా 3వ తేదీనే విడుదల కానుంది.


CSI సనాతన్ - మార్చి 10


'CSI సనాతన్' చిత్రం మార్చి 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కౌశిక్ మహత.. ఆది, నందిని రాయ్‌ లు నటించగా, శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథ ఒక కేసు చుట్టు తిరుగుతుందని.. ఆసక్తికర స్క్రీన్‌ ప్లే తో సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. 


కబ్జా - మార్చి 17 


కన్నడ స్టార్‌  హీరో ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో మంచి పాపులారిటీ కలిగిన ఉపేంద్రతో పాటు ఈ సినిమాలో సుదీప్‌, శ్రియ శరణ్‌ లు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాలో నటించిన వారు అంతా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కనుక కబ్జా కూడా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఆర్‌ చంద్ర దర్శకత్వం వహించారు. 1942 నుంచి 1947 మధ్య కాలంలో సాగే ఆసక్తికర కథ, కథనంతో ఈ సినిమా రూపొందినట్లుగా యూనిట్‌ సభ్యులు అంటున్నారు.


బెదరులంక 2012 - మార్చి 22


మార్చి 22న కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 సినిమా విడుదల కాబోతుంది. అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలో నటించాడు. ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇన్ 2012 కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందింది. విభిన్నమైన ఈ సినిమా తో కార్తికేయ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. 


దాస్ కా ధమ్కీ - మార్చి 22


మార్చి 22న మరో సినిమా కూడా విడుదల కాబోతుంది. అదే విశ్వక్‌ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ నిర్మించాడు. సినిమాలో విశ్వక్‌ సేన్ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. 


దసరా - మార్చి 30న


నాని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దసరా సినిమా కూడా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 30న ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలంగాణలోని గోదావరి ఖని సింగరేణి బొగ్గు గనుల్లో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించినట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌ను చూస్తే అర్థమవుతుంది. నాని ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. గత ఏడాది ‘కేజీఎఫ్‌ 2’, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘కాంతార’ సినిమాలు ఎలా అయితే నిలిచి పోయే విధంగా సూపర్ హిట్‌ అయ్యాయో అదే విధంగా ఈ ఏడాదిలో నిలిచి పోయే సినిమా గా ‘దసరా’ ఉంటుందని నాని చాలా నమ్మకంగా చెప్పుకొచ్చాడు. కనుక ప్రేక్షకులు ‘దసరా’ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటించగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. 


ఇవి మాత్రమే కాకుండా మరి కొన్ని చిన్న సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెలలో రాబోతున్నాయి. మార్చి నెల తర్వాత అసలైన సమ్మర్‌ వినోదాల విందు మొదలవ్వబోతుంది. ఏప్రిల్‌ నెలలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌ లు విడుదలకు సిద్ధమవుతున్నాయి.