Telugu Upcoming Movies: క్రాంతి నుంచి భారీ చిత్రాలు, పెద్ద హీరో సినిమాలు వరుసగా థియేటర్లో సందడి చేస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్‌, నా సామిరంగ, సైంధవ్, నుంచి రవితేజ ఈగల్‌, సందీప్‌ కిషన్‌ ఊరుపేరు భైరవకోన ఇలా జనవరి నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు థియేటర్లో పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఫిబ్రవరి మూడో వారం అంటే ఈ శుక్రవారం థియేటర్లో ఒక్క పెద్ద సినిమా కూడా లేకపోవడం గమనార్హం. నెక్ట్స్ బిగ్‌ సినిమాలన్ని మార్చిలో రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకున్నాయి. అలా ఈ వారం స్టార్‌ హీరో సినిమాలు, బిగ్‌ ప్రాజెక్ట్స ఏ ఒక్కటి లేదు. వైవా హర్ష సందరం మాస్టర్‌, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!' మరో రెండు చిన్న సినిమాలు ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పోటీపడబోతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.


వైవా హర్ష 'సుందరం మాస్టర్‌'


హర్ష ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ సుందరం మాస్టర్ మూవీ తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లోకి రాబోతోంది. ఇందులో హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటించింది. ఈ మూవీని సుధీర్ కుమార్ కుర్రుతో క‌లిసి మాస్ మ‌హారాజా ర‌వితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో హర్ష ఇంగ్లీష్‌ మాస్టార్‌గా ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు. సినిమా అంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రకటించారు మేకర్స్. మూవీలో సుందరం మాస్టార్ గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ సబ్జెక్టు చెప్తుంటాడు. అయితే ఓ మారుమూల పల్లె లో ఉన్న స్కూల్ కు ఇంగ్లీష్ మాస్టారుగా వెళ్లాల్సి వస్తుంది. ఆ స్కూల్ లో అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించాడు అనే విష‌యం తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేనన్నారు మేకర్స్. ఇక మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.


‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'


టాలీవుడ్ కమెడియన్‌ అభినవ్ గోమఠం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు తిరుప‌తి రావు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ కూడా 'సుందరం మాస్టర్‌'తో కలిసి ఫిబ్రవరి 23న థియేటర్లోకి రాబోతోంది. గోదావరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ (అభినవ్ గోమఠం) అనే వ్యక్తి గొప్ప పెయింటర్ అవ్వాల‌ని.. అలాగే త‌న ఊరిలోనే దానిపై మంచి బిజినెస్ పెట్టి లైఫ్ లో సెటిల్ అవుదామని కలలు గంటూ ఉంటాడు. ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తన కి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి? అస‌లు మనోహర్‌కు తాను క‌ల‌లు గన్న జీవితం దొరుకుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


సిద్దార్థ్‌ రాయ్‌


అతడు మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దీపక్ సరోజ్ హీరోగా వస్తున్న చిత్రమే సిద్ధార్థ్‌ రాయ్‌. ఈ చిత్రంలో ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ నెల 23న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన కుర్రాడు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాడు కదా. అత్తారింటికి వచ్చిన బ్రహ్మానందంతో “నాన్నా నా కోసం ట్రైన్ తెచ్చావా?” అని అడుగుతాడు. “హా తెచ్చా రా రైల్వే ప్లాట్‌ఫాం..అది స్టేషన్ లో ఉంది వెళ్లి తెచ్చుకోపో” అంటూ బ్రహ్మీ చెప్పే డైలాగ్ పటాస్ లా పేలుతుంది. అప్పటి  చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ కుర్రాడే దీపక్ సరోజ్. ఇప్పుడు అదే కుర్రాడు హీరోగా వస్తున్న చిత్రం 'సిద్ధార్థ్‌ రాయ్‌'. 


'ముఖ్య గమనిక' మూవీ


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కజిన్ విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. వేణు మురళీధర్‌ దర్శకుడు. శివిన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య కథానాయిక. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న రిలీజ్‌ కాబోతుంది. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి దానిని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి..ఈ పాయింట్‌ ఆధారంగా నడిచే కథ ఇది.