శ్రీశ్రీ... తెలుగు పాఠకులకు, సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. శ్రీరంగం శ్రీనివాసరావు అంటే గుర్తు పట్టడం కాస్త కష్టం ఏమో! కానీ, శ్రీశ్రీ అంటే ప్రతి ఒక్కరూ ఠక్కున గుర్తిస్తారు. ఆయన రచనలు లేదంటే పాటలు గుర్తు చేసుకుంటారు. తెలుగు ప్రజానీకం మీద ఆయన ప్రభావం అటువంటిది. 


కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల... కవితకు ఏదీ అనర్హం కాదని చాటి చెప్పిన కవి శ్రీశ్రీ. అభ్యుదయ భావాలవైపు తెలుగు రచన అడుగులు వేసేలా చేసిన కవి శ్రీశ్రీ. తన రచనలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన విప్లవ కవి శ్రీశ్రీ. నేడు (ఏప్రిల్ 30న) శ్రీశ్రీ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్, ఆయనకు వచ్చిన అవార్డుల వివరాలు తెలుసుకోండి.



  • శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే శ్రీశ్రీ ఇంటి పేరు శ్రీరంగం కాదు. ఆయన ఇంటి పేరు పూడిపెద్ది. విశాఖలో ఏప్రిల్ 30, 1910లో పూడిపెద్ది వెంకటరమణయ్య, ఆటప్పకొండ దంపతులకు ఆయన జన్మించారు. ఆ బాలుడిని శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడంతో ఇంటి పేరు శ్రీరంగం అయ్యింది. అదీ సంగతి!

  • శ్రీశ్రీ పాఠశాల విద్యాభ్యాసం అంతా విశాఖలో సాగింది. తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ హానర్స్ చేశారు. ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ ఆకాశవాణి, ఆంధ్రవాణి పత్రికల్లోనూ శ్రీశ్రీ పని చేశారు.

  • తెలుగు రచనలో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సామాన్యుల గొంతుకగా మారిన కవి శ్రీశ్రీ. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది 'మహాప్రస్థానం'. అందులో కవితలు ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో ప్రముఖుల నోటి వెంట వినపడతాయి. 'నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే...', 'మరో ప్రపంచం', 'నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితరసాధ్యం నా మార్గం' తదితర కవితలు ఆయన రాసినవే.

  • 'ఆహుతి' (1950) సినిమాతో తెలుగు చిత్రసీమలో శ్రీశ్రీ ప్రయాణం, ప్రస్థానం ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత ఆయన వెనుదిగిరి చూసుకోలేదు. తిరిగిరాని లోకాలకు వెళ్లేవరకూ ఆ పెన్ను నుంచి కవితలు, పాటలు వచ్చాయి. 

  • తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ పురస్కారం తీసుకు వచ్చిన ఘనత శ్రీశ్రీది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో 'తెలుగు వీర లేవరా...' పాటకు గాను 1974లో తెలుగు సినిమా పాట నేషనల్ అవార్డు అందుకుంది.


Also Read: 'తండేల్'ను రికార్డ్ రేటుకు కొన్న నెట్‌ఫ్లిక్స్ - చైతూ కెరీర్‌లో హయ్యస్ట్, ఎన్ని కోట్లు అంటే?



విప్లవ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు, ప్రస్తుత కథానాయకుడు గోపీచంద్ తండ్రి టి. కృష్ణ తీసిన 'నేటి భారతం' సినిమాలో 'అర్ధరాత్రి స్వాతంత్ర్యం అంధకార బంధురం' అంటూ శ్రీశ్రీ ఓ గీతం రాశారు. దానికి నంది అవార్డు వచ్చింది.



  • శ్రీశ్రీ సాహిత్యాన్ని గుర్తించిన సాహిత్య అకాడమీ 1972లో ఆయన్ను అవార్డుతో సత్కరించింది. 'ఠాగూర్' సినిమాలో 'నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను...' పాటకు సుద్దాల అశోక్ తేజ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈతరం ప్రేక్షకులు, పాఠకులకు తెలియని విషయం ఏమిటంటే... 'నేను సైతం' రాసింది శ్రీశ్రీ. ఆయన కవిత స్ఫూర్తితో, కవితలో కొన్ని పదాలు తీసుకుని అద్భుతమైన గీతం రాసినందుకు సుద్దాలకు అవార్డు ఇచ్చారు.  

  • శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు. మొదటి సతీమణి పేరు వెంకట రమణమ్మ. ఆవిడ మరణం తర్వాత సరోజినీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు మాల, మంగళ, మంజుల. అబ్బాయి పేరు వెంకట్.

  • తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హాస్య నటుల్లో రాజబాబు ఒకరు. ఆయన శ్రీశ్రీకి తోడల్లుడు. శ్రీశ్రీ మరదల్ని రాజబాబు పెళ్లి చేసుకున్నారు.

  • శ్రీశ్రీ ఒక తరహా పాటలు, ఓ జానర్ గీతాలకు మాత్రమే పరిమితం కాలేదు. రచనలో ఆయన వైవిధ్యం చూపించారు. అన్ని రకాల పాటలూ రాశారు. 'వెలుగు నీడలు'లో 'పాడవోయి భారతీయుడా...' రాసింది ఆయనే. 'ఇలవేల్పు' సినిమాలో 'చల్లని రాజా ఓ చందమామ' గీతం ఆయన కలం నుంచి జాలువారినదే. 'ఊరుమ్మడి బతుకులు' సినిమాలో 'శ్రామిక జీవన సౌందర్యానికి సమాధానమనేది లేనే లోదోయ్' అంటూ రాసిందీ ఆయనే. 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలో 'మనసున మనసై' గీతం వచ్చిందీ ఆయన పెన్ను నుంచే. 'మనుషులు మారాలి' సినిమాలో 'తూరుపు సింధూరపు' అంటూ గర్జించిందీ ఆయనే. 'ఈనాడు' సినిమాలో 'రండి కదిలి రండి...' అంటూ పులుపు ఇచ్చింది శ్రీశ్రీయే. 'ఆరాధన' సినిమాలో 'నా హృదయంలో నిదురించే చెలి' కూడా ఆయన రాసినదే. చెబుతూ వెళితే శ్రీశ్రీ రాసిన పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో!


భౌతికంగా ఇవాళ శ్రీశ్రీ మన మధ్య ఉండకపోవచ్చు. కానీ, ఆయన రచనలతో పాటు పాటలు ఎప్పటికీ ప్రజలకు తోడుగా ఉంటాయి.


Also Readఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ