Super Star Krishna Death Live Updates: గచ్చిబౌలి స్టేడియం కార్యక్రమం రద్దు - అభిమానుల కోసం రేపు పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. భువి నుంచి దివికి మరో తార వెళ్ళింది.
అభిమానుల సందర్శనార్థం బుధవారం కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చీబౌలీ స్టేడియానికి తరలించాలని తొలుత భావించారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 నుంచి 12:30 వరకు పద్మాలయ స్టూడియో వద్ద పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
ప్రముఖ చలనచిత్ర నటుడు, సినీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ హరీశ్ రావ్ సంతాపం వ్యక్తం చేశారు. 350కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల హృదయాల్లో సూపర్ స్టార్ గా నిలిచారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధితనేతగా ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పౌరాణిక, కుటుంబ, సాంఘీక చిత్రాల్లోను, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రాత్మక పాత్రలను, కౌబాయ్, జెమ్స్ బాండ్ తరహా విభిన్న పాత్రలు పోషించి సినీ ప్రియులను కృష్ణ రంజింపజేశారని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఘట్టమనేని శివరామ కృష్ణ మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పద్మభూషణ్, సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణ హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కల్పించే పలు చిత్రాలతో కృష్ణ జనాదరణ పొందారన్నారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.’’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని గుర్తు చేసుకున్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
‘‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకొంటున్నా’’ - చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Background
తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ఇకలేరు. ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు.
తొలుత గుండెపోటు...
తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్యూర్!
Krishna Death Reason : కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.
శోకసంద్రంలో
ఘట్టమనేని కుటుంబం
కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు కృష్ణ కన్ను మూశారు. ఒక్క ఏడాదిలో తమకు ఎంతో ఆప్తులైన ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్ళడం... మూడు విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు (Mahesh Babu), ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.
అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవ దేహాన్ని నేడు ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అభిమానుల సందర్శనార్థం బుధవారం కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చీబౌలీ స్టేడియానికి తరలించాలని తొలుత భావించారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 నుంచి 12:30 వరకు పద్మాలయ స్టూడియో వద్ద పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -