టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచి బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఆదిపురుష్ మూవీ యూనిట్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ జీవో ను కూడా విడుదల చేసింది. అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు నిబంధన ప్రకారం మొదటివారం టికెట్ రేట్స్  పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్ టికెట్ ధరల పెంపకం పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఓ టికెట్ పై రూ.50 రూపాయలను అదనంగా పెంచింది. ఇందుకు మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనంగా మరో షోకి అనుమతి కూడా ఇచ్చింది. కేవలం ఆదిపురుష్ రిలీజ్ రోజే 6 షోలకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 'ఆదిపురుష్' రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ 6 షోలకు పర్మిషన్ ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా దీనికి అదనంగా రూ.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 3D సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్స్ లో గ్లాసులకు అదనపు ధర చెల్లించాలి. అలాగే మల్టీప్లెక్స్ లో 295 + 3D గ్లాస్ చార్జ్ వసూలు చేయనున్నారు. కాగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పై రూ.50 పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


ఇక ఇప్పటివరకు టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో తెలంగాణలో ఇప్పటికీ ఆదిపురుష్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. తాజాగా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం అంటే జూన్ 14 నుంచి తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. కాగా ఇప్పటికే నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్  ఓపెన్ అవ్వగా.. కేవలం నార్త్ లోనే సుమారు రూ.2 కోట్ల రూపాయల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Also Read: మహేష్ బాబు Vs రవితేజ - 2024 సంక్రాంతికి బిగ్ ఫైట్!