థియేటర్లలోకి సెప్టెంబర్ 12, 2025న రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన 'మిరాయ్' (Mirai) ఒకటి. మరో సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కిష్కింధపురి' (Kishkindhapuri).
'మిరాయ్'ను తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఒక్క వారం వెనక్కి వచ్చారు. తమకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తమ సినిమా మీదకు వచ్చారని 'కిష్కింధపురి' టీమ్ ఫీల్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలకు మార్కెట్టులో క్రేజ్ ఎలా ఉంది? ఎవరి సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది ఒక్కసారి చూస్తే...
'మిరాయ్'కు కలిసి వచ్చిన 'హనుమాన్' సక్సెస్!
'మిరాయ్'కు ముందు తేజా సజ్జా నటించిన సినిమా 'హనుమాన్'. పాన్ ఇండియా హిట్ అయ్యింది. హనుమంతుని నేపథ్యంలో ఆ సినిమా తీశారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు, శ్రీరాముని నేపథ్యంలో సూపర్ హీరో కథతో 'మిరాయ్' తీశారు. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగా జరిగింది.
నైజాం రూ. 10 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 5 కోట్లకు, ఆంధ్రాలో ఏరియాలు రూ. 12 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద 'మిరాయ్' ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తోంది. ఏపీ, తెలంగాణలో 'మిరాయ్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విలువ రూ. 27 కోట్లు కింద లెక్క కట్టారు. కర్ణాటకతో పాటు ఇండియాలో మిగతా రాష్ట్రాలు, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో రూ. 5 కోట్లు వచ్చాయట. ఓవర్సీస్ రైట్స్ రూ. 4.50 కోట్లకు విక్రయించారు. దాంతో 'మిరాయ్' టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 36.50 కోట్లు అని ట్రేడ్ టాక్. దాంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ 37.50 కోట్ల షేర్, మినిమమ్ 70 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
'మిరాయ్'లో 'కిష్కింధపురి' బిజినెస్ మూడో వంతు
'మిరాయ్' పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా. భారీ నిర్మాణ వ్యయంతో తీసిన సినిమా. తేజా సజ్జాతో పాటు మంచు మనోజ్, శ్రియ, జగపతి బాబు వంటి భారీ తారాగణం ఉంది. అందువల్ల, బిజినెస్ బాగా జరిగింది. 'కిష్కింధపురి'కి వస్తే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని తీసిన సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మాత్రమే మెయిన్ ఎట్రాక్షన్. అందువల్ల, బిజినెస్ కొంచెం తక్కువ ఉంది.
నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ. 3 కోట్లు, రాయలసీమ రైట్స్ రూ. 1.5 కోట్లు, ఆంధ్రా ఏరియాలు రూ. 3 కోట్లుకు 'కిష్కింధపురి' నిర్మాతలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా... కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో మరో రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. దాంతో 'కిష్కింధపురి' టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 9.50 కోట్లు అయ్యింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ 10.50 కోట్ల షేర్.
Also Read: అమెరికాలో 'ఓజీ'కి అన్యాయమా? పవన్ ఫ్యాన్స్ ఫైర్... క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్!
'కిష్కింధపురి' హారర్ జానర్ సినిమా. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే వస్తారు. అందువల్ల, తక్కువ నిర్మాణ వ్యయంతో తీశారు. 'మిరాయ్' సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా. కుటుంబ ప్రేక్షకులతో పాటు పిల్లలు కూడా వస్తారు. అందువల్ల, ఈ రెండు సినిమాలను కంపేర్ చేయడం భావ్యం కాదు. కానీ, ఒకే రోజు రిలీజ్ అవుతుండటం వల్ల బిజినెస్ ఎలా జరిగింది? ఎవరి మార్కెట్ ఎంత? అనేది చూడటం కామన్. అదీ సంగతి. ప్రస్తుతానికి రెండు సినిమాలకూ బుకింగ్స్ బావున్నాయి. ఆడియన్స్ ఏ సినిమాను పెద్ద హిట్ చేస్తారో చూడాలి.