ఇప్పుడు కన్నడ సినిమా అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. ఉపేంద్ర, సుదీప్ వంటి హీరోలు కొన్నేళ్ల క్రితం నుంచి తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే... 'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార' సినిమాల తర్వాత కన్నడ సినిమాకు మరింత గౌరవం లభించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో పాపులర్ ఫుట్‌బాల్ సహాయ సహకారాలతో ఓ సినిమా రూపొందుతోంది. ఆ చిత్రమే 'డ్యూడ్' (Dude Telugu Kannada Movie). 


హీరో తేజ్ స్వీయ దర్శక నిర్మాణంలో... యువ కథానాయకుడు తేజ్ (Hero Tej) నటిస్తున్న బైలింగ్వల్ సినిమా 'డ్యూడ్'. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు స్వయంగా తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథా రచయిత కూడా ఆయనే. అంతే కాదు... పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై ఆయనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఫుట్‌ బాల్ నేపథ్యంలో ప్రేమకథ!
ప్రేమ కథలు ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు కొత్త కాదు. ఇప్పటి వరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే... ఫుట్ బాల్ నేపథ్యంలో, పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇటు తెలుగులో కానీ, అటు కన్నడలో కానీ ప్రేమకథా చిత్రం రాలేదని, తమ చిత్రమే ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ అని తేజ్ తెలిపారు. కర్ణాటకలోని 'కిక్ స్టార్ట్' అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్ (Kick Start Football Club) తమ చిత్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని వివరించారు. అక్టోబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. కన్నడతో పాటు తెలుగులో కూడా షూటింగ్ చేస్తామని, రెండు భాషలకు తెలిసిన నటీనటులను కీలక పాత్రలకు ఎంపిక చేస్తున్నామని తేజ్ చెప్పారు. 


పాన్ ఇండియా సినిమా 'గాడ్'!
ఇంతకు ముందు 'రామాచారి' సినిమాలో తేజ్ నటించారు. 'డ్యూడ్' కాకుండా పాన్ ఇండియా సినిమా 'గాడ్' ప్రీ ప్రొడక్షన్ లో ఉందని తెలిపారు. 'డ్యూడ్' సినిమాకు వస్తే... కన్నడ, మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని 'అలా మొదలైంది' చిత్రానికి పని చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.


Also Read తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన


తెలుగుకు క్యూ కడుతున్న కన్నడ తారలు
ఇప్పుడు కన్నడ నటీనటులు అందరూ తెలుగుకు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ తెలుగు టీవీ సీరియళ్ళలో నటిస్తున్న మెజారిటీ స్టార్స్ అందరూ కర్ణాటక నుంచి వచ్చిన వారే. 'దసరా'లో నాని స్నేహితుడిగా నటించిన దీక్షిత్ శెట్టిది కర్ణాటక. అంత ఎందుకు? ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర'లో కన్నడ నటుడు తారక్ పొన్నప్పకు కీలక పాత్ర చేసే అవకాశం లభించింది. అలాగే, ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటిస్తున్న సీరియల్ స్టార్ చైత్ర రాయ్ కూడా కన్నడ భామే. ఇప్పుడు చిన్న సినిమాలు, చిన్న సినిమాల్లో తారలు సైతం తెలుగు అవకాశాల కోసం చూస్తున్నారు. 


Also Read యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్