Vetri Duraisamy Dead Body Found: తొమ్మిది రోజుల క్రితం మిస్ అయిన తమిళ దర్శకుడు వెట్రి దురైసామి బాడీ ఎట్టకేలకు దొరికింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ జిల్లాలో ఉన్న సట్లెజ్ నదిలో ఎనిమిది రోజులుగా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూనే ఉండగా.. వెట్రి మృతదేహం దొరికింది. వెట్రి దురైసామి తండ్రి, మాజీ చెన్నై మేయర్ సదాయ్ దురైసామి.. ఇటీవల తన కొడుకు బాడీని కనిపెట్టిన వారికి రూ.1 కోటి బహుమతిగా ఇస్తానని కూడా ప్రకటించారు. అంతే కాకుండా సెర్చ్ ఆపరేషన్స్‌కు సహాయ పడమని అక్కడ నివాసముండే ప్రజలను కోరాడు. ఫైనల్‌గా వెట్రి దురైసామి బాడీ దొరకడంతో చెన్నైలోని తన ఇంటికి తరలించారు.


అసలు ఏం జరిగింది?


ఫిబ్రవరీ 4న వెట్రి దురైసామి వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగి పక్కనే ఉన్న సట్లెజ్ నదిలో పడిపోయింది. షిమ్లా నుండి కాజాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్ తంజిన్ బాడీ ఫిబ్రవరీ 5న దొరికింది. తంజిన్ లాహాలూల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కారులో డ్రైవర్, వెట్రితో పాటు గోపీనాథ్ అనే మరో వ్యక్తి కూడా ఉండగా.. ఆయనకు తీవ్ర గాయాలు అవ్వడంతో షిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల గాలింపుల తర్వాత వెట్రి దురైసామి బాడీ దారుణమైన స్థితిలో లభించింది. ఆయన పార్థీవ శరీరాన్ని చెన్నైకు తరలించారు. ఈ సమాచారం తెలియగానే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. 


అజీత్ నివాళులు, కమల్ హాసన్ ట్వీట్..


యాక్టర్ అజిత్‌తో వెట్రికి మంచి స్నేహం ఉండేది. వెట్రిని అజిత్.. తన రైడింగ్ పార్ట్‌నర్‌గా భావించేవాడు. అందుకే తనను చివరిసారి చూడడానికి వెంటనే తన ఇంటికి చేరుకున్నాడు. కమల్ హాసన్ సైతం ఈ ఘటనపై ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘మాజీ చెన్నై మేయర్, నా ఫ్రెండ్ సైదై దురైసామి కుమారుడు వెట్రి దురైసామి మరణ వార్త విని చాలా బాధేసింది. యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది ఊహకు అందని బాధ. కొడుకును కోల్పోయిన తండ్రికి నా సంతాపం తెలియజేస్తున్నాను. దీని నుండి ఆయన త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అని కమల్ హాసన్ అన్నారు.


స్పందించిన సీఎం..


తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, ఏఐఎడీఎమ్‌కే జెనరల్ సెక్రటరీ ఎడప్పడీ కే పలనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ కలిసి వెట్రి దురైసామి ఇంటికి చేరి, తన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ‘‘ఏ తండ్రికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు’’ అని స్టాలిన్ అన్నారు. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నా కూడా వెట్రి దురైసామి మాత్రం సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు. అందుకే 2021లో ‘ఎండ్రావతు ఒరు నాల్’ అనే చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో రమ్య నంబీసన్, విధార్థ్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు వెట్రి. 


Also Read: గుడ్‌న్యూస్‌ చెప్పిన మెగా కోడలు - క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేసిన ఉపాసన! ఫొటో వైరల్‌