కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చియాన్ విక్రమ్ ఇప్పుడు మరోసారి ఓ ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'శివ పుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' లాంటి సినిమాలు విక్రమ్ నటనకు, సాహసాలకు అద్దం పట్టాయి. పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే విక్రమ్ ఇప్పుడు 'తంగలాన్' అనే మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. ఇక టీజర్ గురించి చెప్పాలంటే ఎలాంటి డైలాగ్ లేకుండా విక్రమ్ బాడీ లాంగ్వేజ్, నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీజర్ లో విక్రమ్ విచిత్రమైన అఘోర తరహా గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా చాలా రా అండ్ రస్టిక్‌గా ఈ టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే టీజర్ లాంచ్ సందర్భంగా మూవీ టీం హైదరాబాదులో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో విక్రమ్ సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు మూవీ టీం ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగానే ఓ రిపోర్టర్ నుంచి విక్రమ్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
‘‘తమిళ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసినంతగా.. తెలుగు సినిమాని తమిళ ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం లేదు. దీనికి కారణం ఏంటి?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. ఇందుకు విక్రమ్ బదులిస్తూ.. "అందులో వాస్తవం లేదు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాలు తమిళనాడులో టాప్ గ్రాఫర్స్ గా నిలిచాయి. తెలుగు సినిమాకి మేము ఎంత ప్రాముఖ్యత ఇస్తామనేది మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ‘ఐ’ చిత్రానికి మేము జాతీయ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమిళ జ్యురీ మెంబర్ ఒకరు నాకు చెప్పారు. మేము ‘బాహుబలి’ తమిళ వెర్షన్‌ను జాతీయ అవార్డులకు పంపాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మీ చిత్రానికి సపోర్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. తెలుగు సినిమాకు మేము ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం" అంటూ విక్రమ్ తనదన శైలిలో సమాధానం ఇచ్చారు.
‘‘ఇతర భాష చిత్రాలన్నీ కూడా తమిళంలో బాగా ఆడాయి. 'కాంతారా', 'కేజీఎఫ్' చిత్రాలు అందుకు ఉదాహరణ అని విక్రమ్ అన్నారు. ఆ తర్వాత నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని ఖండిస్తూ.. "సినిమాకి భాషతో సంబంధం లేదు. మేకర్స్ మైండ్ సెట్ మారాలి. మంచి కంటెంట్ ఉంటే ఏ భాష సినిమానైనా ఆడియన్స్ ఆదరిస్తారు. సినిమాకి బ్యారియర్స్ అనేవి లేవు. ఉదాహరణకి 'కేజీఎఫ్' సినిమా ఏ భాషా చిత్రమో నార్త్ ఇండియన్స్ కి ఇప్పటికీ తెలియదు. వాళ్ళు ఇప్పటికీ 'కేజిఎఫ్' తమిళ్ లేదా తెలుగు ఫిలిం అనుకుంటున్నారు. కానీ అది ఒక కన్నడ సినిమా అని ఇప్పటికీ రియలైజ్ అవ్వడం లేదు. కాబట్టి సినిమా అనేది సినిమా అంతే. దానికి భాషతో సంబంధం లేదు" అని నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నారు.
ఇక 'తంగాలన్' మూవీ విషయానికొస్తే.. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : డైలాగ్స్ లేవు, డబ్బింగ్ లేదు, ‘తంగలన్’ కంప్లీట్ డిఫరెంట్ మూవీ - విక్రమ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial