Bandra Movie Review: రివ్యూలు అనేవి సినిమా రిజల్ట్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు రివ్యూలను బట్టి సినిమాకు వెళ్లాలా, వద్దా అని డిసైడ్ చేసేస్తున్నారు. దీంతో పెయిడ్ రివ్యూల స్కామ్ కూడా ఎక్కువయిపోయింది. తాజాగా ఒక మలయాళ చిత్రంపై రివ్యూల ప్రభావం తీవ్రంగా పడింది. కానీ మూవీ టీమ్ సైలెంట్‌గా ఉండిపోలేదు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లపై యాక్షన్ తీసుకోవాలని కోర్టుకెక్కింది. తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తూ దాదాపు ఏడుగురు యూట్యూబర్లపై యాక్షన్ తీసుకోవాలని ‘బాండ్రా’ మూవీ టీమ్ కోరింది.
బాండ్రా(Bandra) మూవీకి రివ్యూల దెబ్బ
అరుణ్ గోపీ దర్శకత్వంలో దిలీప్ నటించిన మలయాళ చిత్రం ‘బాండ్రా’ (Bandra) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఏడుగురు యూట్యూబర్లు తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ‘బాండ్రా’ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ అజిత్ వినాయక ఫిల్మ్స్.. తిరువనంతపురంలోని కోర్టుకు ఆశ్రయించింది. వారిచ్చిన రిపోర్టులో అశ్వంత్ కాక్, షిహాబ్, ఉన్ని వ్లాగ్స్, షాహ్ మహమ్మద్, అర్జున్, షిజాస్ టాక్స్, సాయి కృష్ణన్ వంటి ఏడుగురు యూట్యూబర్లు, వాటి యూట్యూబ్ ఛానెళ్ల పేర్లు ఉన్నాయి. వీరు ఇచ్చిన తప్పుడు రివ్యూల వల్లే సినిమాకు నష్టాలు వచ్చాయని కూడా ప్రొడక్షన్ సంస్థ రిపోర్టులో పేర్కొంది.
అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది
తిరువనంతపురం కోర్టు త్వరలోనే ఈ యూట్యూబర్లపై తగిన యాక్షన్ తీసుకోవాలి అని అజిత్ వినాయక ఫిల్మ్స్ కోరింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించాలని కావాలనే ఈ యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు రివ్యూలను ఇచ్చాయని తెలిపింది. ఇలాంటి రివ్యూ బాంబింగ్ వల్ల ఫిల్మ్ మేకర్స్‌కు కోట్లలో నష్టం ఉంటుందని, అందుకే కొందరిపై ఇలాంటి యాక్షన్ తీసుకుంటే మిగతావారు కూడా ఇలా చేయడానికి భయపడతారని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎవరి అభిప్రాయం వారు చెప్పే స్వేచ్చ అందరికీ ఉంటుందని, కానీ అది ఇతరులకు నష్టం కలిగించేలా ఉండకూడదని పోలిసులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సీనియర్ నటీనటులతో..
‘రామలీల’ తర్వాత ‘బాండ్రా’తో మరోసారి చేయి కలిపారు దిలీప్, అరుణ్ గోపీ. అయితే ‘బాండ్రా’ కోసం సీనియర్ నటీనటులను రంగంలోకి దించాడు దర్శకుడు అరుణ్ గోపీ. శరత్ కుమార్, తమన్నా, డినో మోరియా, కళాభవన్ షాజన్, గణేశ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా అలనాటి నటి దివ్యభారతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిందని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అదే అంశం ఈ మూవీ ప్రమోషన్‌కు తోడ్పడింది. కానీ నెగిటివ్ రివ్యూల వల్ల ‘బాండ్రా’కు తగిన కలెక్షన్స్ రాలేదని, కొందరు కావాలనే ఇలాంటి రివ్యూలను వ్యాప్తి చేశారని మూవీ టీమ్ వాపోతోంది. ఎన్నో ఏళ్లుగా సౌత్ సినీ పరిశ్రమలో స్టార్‌గా వెలిగిపోతున్న తమన్నాకు మలయాళంలో ఇది డెబ్యూ చిత్రం. దీంతో తమన్నా కూడా ఈ మూవీ హిట్ అయితే మాలీవుడ్‌లో తన కెరీర్ సాఫీగా సాగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఎంత హైప్ మధ్య విడుదలయిన కూడా ‘బాండ్రా’కు తగినంత ఆదరణ లభించలేదు. దీనికి నెగిటివ్ రివ్యూలు కూడా కారణం కావడంతో ఆ యూట్యూబర్లపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని మూవీ టీమ్ కోరుకుంటున్నారు.
Also Read: మొన్న రష్మిక, నేడు కాజోల్ - మరీ దారుణమైన వీడియోను పోస్ట్ చేసిన ‘ఫేక్’గాళ్లు!