ఏ భాషలో అయినా బయోపిక్స్‌కు ఉండే క్రేజే వేరే. మనకు తెలియని వ్యక్తుల గురించి మాత్రమే కాదు.. తెలిసిన వ్యక్తుల జీవితకథల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ బయోపిక్స్ ఉపయోగపడతాయి. అందుకే బయోపిక్స్‌ను ఒక సక్సెస్ ఫార్ములాగా చూస్తారు మేకర్స్. ముఖ్యంగా అలనాటి నటీనటుల బయోపిక్స్‌కు వేరే లెవెల్‌లో క్రేజ్ ఉంటుంది. అదే విధంగా అలనాటి అందాల తార దివ్యభారతి బయోపిక్ తెరకెక్కించాలని ఇప్పటికే చాలామంది మేకర్స్ ప్రయత్నించారు. తాజాగా ఆమె బయోపిక్.. సైలెంట్‌గా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ బయోపిక్‌లో దివ్యభారతీ పాత్రలో తమన్నా నటించిందట.


‘బాండ్రా’లో దివ్యభారతీగా..
సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఇండస్ట్రీలో కూడా మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తమన్నా. ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ ఇప్పటివరకు మలయాళ చిత్రాల్లో మాత్రం తన అడుగుపడలేదు. ఇక తను మాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ నటిస్తున్న మొదటి చిత్రం ‘బాండ్రా’. ‘రామలీలా’ లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ గోపీ.. ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. ‘బాండ్రా’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని మేకర్స్ చెప్తున్నారు. ఇక మాలీవుడ్‌లో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం.. ఈ సినిమాలో తమన్నా.. అలనాటి నటి దివ్యభారతీ పాత్రలో కనిపించనుందని సమాచారం.


అతి చిన్నవయసులోనే మరణం..
దివ్యభారతీ ఎవరు అని ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 1990ల్లో షారుఖ్ ఖాన్, గోవింద లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని తాను కూడా ఓ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది దివ్యభారతీ. హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి స్టార్లతో నటించింది. చాలా చిన్న వయసులోని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన దివ్యభారతీ.. తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ముంబాయిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిని ఆత్మహత్య అని నిర్ధారించి పోలీసులు కేసును కొట్టిపారేశారు. కానీ ఇప్పటికీ దివ్యభారతీ మరణం వెనుక ఏదో కథ ఉందని అప్పటి ప్రేక్షకులు అనుకుంటూనే ఉంటారు.


కచ్చితంగా కాంట్రవర్సీలు తప్పవు..
అలాంటి అనుమానాస్పద మృతి చెందిన ఒక స్టార్ నటి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఇప్పటికీ ఎంతోమంది మేకర్స్ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఏదీ వర్కవుట్ అవ్వలేదు. ఇక తమన్నా నటిస్తున్న ‘బాండ్రా’ మాత్రం దివ్యభారతీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో తమన్నా ఒక హీరోయిన్‌గా నటిస్తుందని విడుదలయిన పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. ‘బాండ్రా’లో తమన్నాకు జోడీగా దిలీప్ కనిపించనున్నాడు. ఈ మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని మూవీ టీమ్ చెప్పినా.. అంతకు మించి ఈ కథ గురించి పెద్దగా సీక్రెట్ ఏమీ రివీల్ చేయలేదు. ఒకవేళ ఇది దివ్యభారతీ బయోపిక్ అయితే.. కచ్చితంగా ఈ సినిమా ఎంతో సెన్సేషన్‌తో పాటు ఎన్నో కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేస్తుంది అంటూ మలయాళ ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: లోదుస్తుల్లో నటించలేదని మాధురితో గొడవ, ఆగిపోయిన సినిమా - స్పందించిన డైరెక్టర్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial