Odela 2 Movie Shooting Start: హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో 2022లో తెరకెక్కిన చిత్రం 'ఓదెల రైల్వే స్టేషన్'. కరోనా కాలంలో క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆహా స్ట్రీమింగ్‌ అయిన ఓదేల రైల్వే స్టేషన్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. 20 ఆగస్ట్‌ 26న రిలీజైన ఈ సినిమాను సుద్దాల అశోక్ తేజ దర్శకత్వంలో వహించగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించారు.


శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మించారు. ఆగస్టు 26వ తేదీన 2022లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. 'ఓదెల 2' టైటిల్‌తో సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. ఇందులో స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్‌ రోల్‌ చేయబోతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రముఖ ఆద్యాత్మిక పుణ్య క్షేత్రం కాశీలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది తమన్నాతో ఫస్ట్‌ సీన్‌కు క్లాప్‌ కొట్టారు. వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్‌. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. 'కాంతార' చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందించిన అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సీక్వెల్‌కి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. 


ఆసక్తిగా ఓదెల 2 టైటిల్ పోస్టర్ 


మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా మూవీ యూనిట్‌ ఓదెల 2 టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టైటిల్‌ పోస్టర్‌లోనే మూవీ థీమ్‌ అర్థమైపోతుంది. ‘ఓదెల 2’ మరింత రూటెడ్‌గా థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని మూవీ యూనిట్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ సీక్వెల్ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. టైటిల్ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇది మల్లన్న స్వామిగా పూజింపబడే శివుని త్రిశూలాన్ని చూపిస్తుంది.


ఓదెల రైల్వే స్టేషన్ కథంటేంటే..


అనుదీప్ (సాయి రోనక్) సివిల్స్ టాపర్. ఐఏఎస్ వద్దని మరీ ఐపీఎస్ తీసుకుంటారు. పోస్టింగ్‌కు ముందు మూడు నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళతారు. ఆ ఊరిలో కొత్త పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత అదే విధంగా మరో మూడు హత్యాచారాలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్‌కు దొరికాడా? లేదా? ఆయనకు దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసే తిరుపతి (వశిష్ట సింహ) భార్య రాధ (హెబ్బా పటేల్) ఏ విధంగా సహాయ పడింది? అనుదీప్ ప్రేయసి స్ఫూర్తి (పూజిత పొన్నాడ) ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు, రాధ ఎవరి తల నరికి పోలీస్ స్టేషన్ గడప ఎక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.