'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత తారక్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్‌లో NTR30 సినిమా ఉంటుందని కొరటాల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఒక ఎమోషనల్ రైడ్ గా భారీ స్థాయిలో తీస్తున్నామని.. తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అవుతుందని అంచనాలు రెట్టింపు చేశాడు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో తారక్ తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తారని అంటున్నారు.
NTR30 కథలో మనుషుల కంటే మృగాళ్లు ఎక్కువగా ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కొరటాల శివ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో వెల్లడించారు. అయితే ఇప్పుడు తారక్ తో ద్విపాత్రాభినయం చేయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నందమూరి వారసుడు గతంలో పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు. మరోసారి రెండు పాత్రల్లో నటిస్తున్నారనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
కాగా, NTR30 చిత్రాన్ని స్టార్ క్యాస్టింగ్ తో, టాప్ టెక్నిషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకొచ్చారు. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన జాన్వీకి ఇది టాలీవుడ్ డెబ్యూ. అలానే హిందీ స్టార్ సైఫ్ ఆలీఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తారని టాక్. ఇక ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నుంచి మురళీ శర్మ వరకు ఇంకా భారీ తారాగణం ఈ సినిమాలో భాగం అవుతున్నారట.
మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఎన్టీఆర్ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. హలీవుడ్ VFX సూపర్ వైజర్ బ్రాడ్ మినించ్, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బాట్స్ సైతం ఈ మూవీ కోసం వర్క్ చేస్తుండటం విశేషం.
మొత్తం మీద ఎన్టీఆర్ కు గ్లోబల్ వైడ్ వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున NTR30 చిత్రాన్ని ప్లాన్ చేసారు. పాన్ ఇండియా వైడ్ గా అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కానుంది. 2024 సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.