సినీ ఇండస్ట్రీలో నెపోటిజం, ఫేవరిజం ఎక్కువగా ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచే హీరో హీరోయిన్లు, నటీ నటులు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. టాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సినీ ప్రముఖుల వారసురాళ్లు కెమెరా ముందుకు రావడాన్ని తరచుగా చూస్తుంటాం కానీ.. వెనకుండి చిత్ర నిర్మాణ బాధ్యతలు నిర్వహించడం చాలా అరుదుగా చూస్తుంటాం. మనం బాగా గమనించినట్లయితే, ఇటీవల కాలంలో అనేకమంది వారసురాళ్లు ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు. ఏదో ఆషామాషీగా పరిశ్రమలో అడుగుపెట్టకుండా, బాగా చదువుకుని సినిమాల మీద పూర్తి అవగాహన తెచ్చుకునే నిర్మాతలుగా మారుతున్నారు. 


వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆల్రెడీ నిర్మాతలుగా రాణిస్తున్నారు. తన తండ్రి పేరు మీదుగా రూపొందే సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. 18 ఏళ్ళ వయసులోనే 'ఆజాద్' చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన స్వప్న.. స్వప్న సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి తన సోదరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. మరోవైపు 'బాలు' మూవీకి కో-ప్రొడ్యూసర్ గా చేసిన ప్రియాంక.. త్రీ ఏంజెల్స్ స్టూడియో అనే సంస్థను ప్రారంభించి 'ఓం శాంతి' 'బాణం' లాంటి చిత్రాలను నిర్మించింది. ఈ అక్కాచెల్లెళ్లు కలిసి 'మహానటి' 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'సీతారామం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. 


మెగా డాటర్స్ సుశ్మిత, నిహారికలు నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన సుష్మిత కొణిదెల.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ప్రస్తుతం తన తండ్రితో Mega156 చిత్రం చేయడానికి రెడీ అవుతోంది. అలానే హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి వెబ్ సిరీసులు రూపొందిస్తోంది. అక్కినేని వారసురాలు సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కే అన్ని సినిమాల వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


Also Read: బాలయ్య 'అన్ స్టాపబుల్' అప్డేట్ - సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే?
 
అగ్ర నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లో సినిమా నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా దిల్ రాజ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి మూవీస్ నిర్మిస్తోంది. ఇప్పటికే 'బలగం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి, విమర్శకుల ప్రశంసలతో పాటుగా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురు జాన్వీ సైతం తన తండ్రి నిర్మించిన 'లవ్ స్టోరీ' 'ది ఘోస్ట్' సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఆ మధ్య 'నేను మీకు కావల్సిన వాడిని' అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా మారింది.


వీరందరి కంటే ముందు ఘట్టమనేని వారసురాలు, సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా నిర్మాతగా సినిమాలు తీసింది. 2002 లో 'షో' చిత్రంతో నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించిన ఆమె.. తన తమ్ముడు మహేశ్ బాబుతో 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసి నంది అవార్డు గెలుచుకుంది. చివరగా ఇందిరా ప్రొడక్షన్స్ లో 'ఏమాయ చేసావే' లాంటి కల్ట్ లవ్ స్టోరీని నిర్మించి ప్రశంసలు అందుకుంది మంజుల. అలానే డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తనయ లక్ష్మీ ప్రసన్న కూడా ఎప్పటి నుంచో సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ వస్తోంది. 


ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె సూర్యదేవర హారిక కూడా చేరింది. MAD సినిమాతో నిర్మాతగా మారిన హారిక.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీనికి ఆమె సోదరుడు నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. రానున్న రోజుల్లో హారిక నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. 


ఇలా మంజుల దగ్గర నుంచి హారిక వరకు పలువురు మహిళా నిర్మాతలు టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు. వారసత్వంగా పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ, ఎప్పటికప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మరియు న్యూ ఏజ్ ఫిలిమ్స్ నిర్మిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి భవిష్యత్ లో ఇంకెంతమంది న్యూ ఏజ్ లేడీ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.


Also Read: 'సలార్' to 'దేవర' - రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తెలుగు సినిమాలివే!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial