Michaung cyclone: చెన్నైను మరోసారి తుఫాను ముంచెత్తుతోంది. చెన్నై, వైజాగ్ ప్రాంతంలో చలికి, వానకి వణికిపోతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలకు సరైన ఆహారం కూడా దొరకడం కష్టమయిపోతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారికి సాయం అందించడానికి పలువురు ముందుకొస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఆర్థికంగా తమ సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. అందులో ముందుగా కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీ.. ఆర్థిక సాయం అందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువల్లూర్ వంటి ప్రాంతాల్లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ ఆర్థిక సాయం చేరనుంది.


ఫ్యాన్ క్లబ్స్ ద్వారా సాయం..
సూర్య, కార్తీ.. రూ.10 లక్షలను చెన్నైలోని వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. తమ ఫ్యాన్ క్లబ్స్ ద్వారా ఇవి ప్రజలకు చేరేలా చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ఈ డబ్బు ద్వారా సాయం అందించమని వారు చెప్పినట్టు తెలుస్తోంది. అప్పుడే సూర్య, కార్తీ ఫ్యాన్ క్లబ్స్.. పలువురికి సాయం అందించడానికి రంగంలోకి దిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు మొత్తంగా 'మిగ్‌జాం' తుఫాన్ ముప్పు పొందని ఉందని ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నైతో పాటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఇచ్చింది. మరోవైపు ఏపీలో కూడా తుఫాన్ బీభత్సం నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వీరికి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. మన టాలీవుడ్ స్టార్స్ దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తుఫాన్ తర్వాత బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది.


కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం..
2015లో వచ్చిన వరదలకంటే ఇవి మరింత తీవ్రంగా ఉన్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అందుకే ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్పా ఇంటి నుంచి బయటికి రాకూడదని హెచ్చరించారు. రిలీఫ్ సంస్థల్లో పనిచేసేవారిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5000 కోట్ల ఆర్థిక సాయాన్ని కోరినట్టు బయటపెట్టారు. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి కూడా ఇందులో నుంచి ఆర్థిక సాయం అందుతుందని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం సినీ సెలబ్రిటీలలో సూర్య, కార్తీ తప్పా ఇంకా ఎవరు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా వార్తలు బయటికి రావడం లేదు.


తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..
సూర్య, కార్తీ.. ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటినుండో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా సూర్య.. తన చారిటీ సంస్థల ద్వారా ఇప్పటికే ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. ప్రస్తుతం ముందస్తు రిలీఫ్‌గా రూ.10 లక్షలు అందజేసినా.. సూర్య, కార్తీ మరికొంత ఆర్థిక సాయం అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికీ 'మిగ్‌జాం' తుఫాన్ వల్ల తమిళనాడులో ఎనిమిది మరణించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్నో రోడ్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఈ 'మిగ్‌జాం' ముప్పు పొంచి ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే విశాఖపట్నం కూడా తమిళనాడులాగానే మారిపోయింది. వైజాగ్‌పై కూడా 'మిగ్‌జాం' తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.


Also Read: 'మిగ్‌జాం' తుఫాన్, మీలా మేం సేఫ్ కాదు - అధికారులు, ఎమ్మెల్యేలూ బయటకు రండి: హీరో విశాల్ ఫైర్