Kollywood Actor Vishal : 'మిగ్‌జాం' తుఫాన్ తమిళనాడును ముంచెత్తుతోంది. ఇప్పటికే చెన్నైలో ఉన్న రోడ్లన్నీ జలపాతాన్ని తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాలలో వర్షపు నీరు చుట్టుముట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఈ పరిస్థితి పై కోలీవుడ్ అగ్ర హీరో విశాల్(Vishal) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)(Greater Chennai Corporation) విఫలమైందంటూ విశాల్ ఆరోపించాడు.


"డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్) జీసీసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లల్లోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితుల్లో లేము. 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వాళ్ళందరికీ మేము సహాయం చేశాం. కానీ 8 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం ఎంతో బాధగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము ఖచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాం. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి, అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను" అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోని పోస్ట్ చేసాడు.






దీంతో విశాల్ (Vishal) చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా 'మిగ్‌జాం' తుఫాన్ తమిళనాడు(Tamilnadu) మరియు ఆంధ్రప్రదేశ్(Andrapradesh) తీరానికి సమీపంలో చేరుకోవడంతో డిసెంబర్ 4 సోమవారం రాత్రి చెన్నైలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి చెన్నై విమానాశ్రయంలో భారీగా వరద చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పలు విమానాలను రద్దుచేసి మరికొన్నిటిని దారి మళ్లించారు. చెన్నై విమానాశ్రయంలోని రన్ వే, ఎయిర్ ప్లైన్ పార్కింగ్ జోన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఈ 'మిగ్‌జాం' తుఫాన్ డిసెంబర్ 5న నెల్లూరు - మచిలీపట్నం మధ్య దక్షిణాంధ్ర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.


ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చెట్లు, గోడలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తమిళనాడు రాజధాని చెన్నై(Chennai) లో వర్షాల కారణంగా ఏకంగా ఐదుగురు మరణించారు. కొన్ని మెట్రో స్టేషన్స్ లోనూ వరద నీరు చేరింది. చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు ముంచుకు రావడంతో ఆరోగ్య సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరి దీనిపై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Also Read : ఫోన్ స్విచాఫ్ చేసుకొని వెళ్లిపోయారు - సంతోషం అవార్డ్స్‌లో ఏం జరిగిందో బయటపెట్టిన టీఎఫ్‌సీసీ