నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. #NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది. హీరో తారకరత్న అకాల మరణం కారణంగా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
NBK108 చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'డిక్టేటర్', 'అఖండ', 'వీర సింహారెడ్డి' సినిమాలను చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన తమన్.. మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా బాలయ్య సొంత పాటనే రీమిక్స్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు.
బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో ‘సమర సింహారెడ్డి’ ఒకటి. ఈ మూవీలో ‘అందాల ఆడబొమ్మ’ అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వర బ్రహ్మ మణిశర్మ కంపొజిషన్ లో ప్రముఖ గాయనీ గాయకులు ఉదిత్ నారాయణ - సుజాత కలిసి ఆలపించిన ఈ పాట, ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి సూపర్ హిట్ సాంగ్ ని ఇప్పుడు NBK108 సినిమా కోసం చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట.
తెలుగు సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ పెట్టడం అనేది కొత్తేమీ కాదు. కాకపోతే ఇటీవల కాలంలో ట్రెండ్ కాస్త తగ్గింది. ఇటీవలే ‘అమిగోస్’ మూవీలో ‘‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’’ అనే బాలయ్య సినిమాలోని పాటను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ బాలకృష్ణ సొంత సినిమాలోని పాటను తన కొత్త చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారని అంటున్నారు. మాములుగా చిన్న మీడియం రేంజ్ హీరోలు ఓల్డ్ సాంగ్స్ ని రీమిక్స్ చేయడం మనం చూస్తుంటాం. మరి ఇప్పుడు నటసింహం రీమిక్స్ సాంగ్ తో తన ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తారేమో వేచి చూడాలి.
ఇకపోతే NBK108 చిత్రంలో గాడ్ ఆఫ్ మాస్సెస్ బాలయ్యను ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి హామీ ఇచ్చారు. దీని కోసం విభిన్నమైన మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తోందని టాక్. అయితే, శరత్ కుమార్ కూతురుగా నటిస్తోందని కూడా సమాచారం. బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ ని విలన్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.
'అఖండ' 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. మరి బాలకృష్ణ - అనిల్ - థమన్ వంటి మూడు ఫోర్సెస్ కలిసి ఎలాంటి సినిమాతో వస్తారో వేచి చూడాలి.