'ఆర్ఎక్స్ 100' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి మొదలైందని చెప్పాలి. ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను తెరకెక్కించే విధానంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.


'మంగళవారం'తో నిర్మాతగా అజయ్ భూపతి
'మంగళవారం' సినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా మారారు. 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన... ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమది పాన్ ఇండియా సినిమా కాదని, సౌత్ ఇండియన్ మూవీ అని చిత్ర బృందం పేర్కొంది. 


ఇండియాలో ఎవరూ ట్రై చేయని జానర్
'మంగళవారం' కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... సీతాకోక చిలుక మధ్యలో ఓ అమ్మాయిని చూపించారు. అయితే, ఆ అమ్మాయి ఎవరనేది స్పష్టంగా కనిపించలేదు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు. త్వరలో హీరో హీరోయిన్ల వివరాలు చెబుతామన్నారు. సినిమాలో మొత్తం 30 కీలక పాత్రలు ఉన్నాయని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.


Also Read : భార్య, పిల్లలతో తారకరత్న లాస్ట్ ఫోటో ఇదే - ఎమోషనల్ అయిన అలేఖ్యా రెడ్డి

ఇంకా అజయ్ భూపతి మాట్లాడుతూ ''కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ట్రై చేయనటువంటి కొత్త జానర్ సినిమా. 'మంగళవారం' టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే'' అని తెలిపారు.


'కాంతార' అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో... 
చిత్ర నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''అజయ్ భూపతి 'ఆర్ఎక్స్ 100'తో ప్రేక్షకులను ఎలా అయితే సర్‌ప్రైజ్ చేశారో, ఈ 'మంగళవారం' చిత్రంతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ & కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని తెలిపారు.


Also Read : ఎన్టీఆర్‌ను పిలిచాం కానీ - టాలీవుడ్ ఫ్యాన్ వార్ దెబ్బకు హాలీవుడ్ రియాక్షన్






 
పాయల్ పేరు చెప్పలేదు ఎందుకు?
'ఆర్ఎక్స్ 100'తో పంజాబీ అమ్మాయి, కథానాయిక పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ను అజయ్ భూపతి తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాయి. విక్టరీ వెంకటేష్ సరసన 'వెంకీ మామ', మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'డిస్కో రాజా' వంటి భారీ చిత్రాలు చేశారు. అయితే, కొన్నాళ్లుగా ఆమె జోరు తగ్గింది. 'మంగళవారం'లో పాయల్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నట్లు తెలిసింది. అజయ్ భూపతితో మళ్ళీ వర్క్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆమె పేరు దర్శక నిర్మాతలు ప్రకటించలేదు. బహుశా... సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఏమైనా ప్లాన్ చేశారేమో!?


ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, అజయ్ భూపతి, కథ - కథనం - దర్శకత్వం : అజయ్ భూపతి.