Sundeep Kishan Offer to Audience: సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊరు పేరు భైరవకోన’ చాలాసార్లు వాయిదా పడి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్న తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరీ 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఊరు పేరు భైరవకోన’ విడుదలకు సిద్ధమయినా దానికంటే రెండు రోజుల మందే ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ ప్రీమియర్ షోల నుండే ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభించింది. సినిమాను ఎలాగైనా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తుంది మూవీ టీమ్. అదే క్రమంలో తిరుమలకు కూడా వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఫ్యాన్స్‌కు ఓ ఆఫర్ ఇచ్చాడు సందీప్ కిషన్.


తిరుమలలో టీమ్ సందడి..


సందీప్ కిషన్, వర్షా బొల్లామాతో ఇతర ‘ఊరు పేరు భైరవకోన’ టీమ్ కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి సినీ విశేషాలను పంచుకున్నారు. ఎప్పటినుండో తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చూసినా కుదరలేదని సందీప్ చెప్పుకొచ్చాడు. ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడమే దీనికి కారణం. అంతే కాకుండా తన కాలికి గాయమయ్యిందని, తిరుమల మెట్లు ఎక్కడం కష్టమన్నారని కూడా బయటపెట్టాడు. అంతే కాకుండా దర్శనం విషయంలో కూడా క్లారిటీ లేదని అన్నారని గుర్తుచేసుకున్నాడు. ఫైనల్‌గా దేవుడిని తాను ఏం కోరుకున్నాడో చెప్తూ.. ‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్ షోలకు వెళ్తున్న ప్రేక్షకులకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.


డిస్కౌంట్..


‘‘నా తరపున ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను. ఇంత నమ్మకం పెట్టుకొని సినిమాకు వస్తున్నారు. మనం ఏం ఇవ్వగలం అని నాకు అర్థం కాలేదు. నేను చాలా ఆలోచించాను. నా వల్ల కుదిరింది నేను చేయాలనుకుంటున్నాను. ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరు, ఏ ఊళ్లో కొనుకున్నా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ టికెట్స్‌ను మీరు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఉన్న ఏ వివాహ భోజనంబు రెస్టారెంటుకు అయినా చూపించి 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. వచ్చే 15, 20 రోజుల్లో ఈ డిస్కౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది మా తరపున కృతజ్ఞత తప్పా ఇంకేమీ కాదు. ప్రతీ సినిమాకు రెండేళ్లు కేటాయించినప్పుడు ప్రేక్షకులకు అది నచ్చడం చాలా ముఖ్యం’’ అని ఆఫర్ ఇచ్చాడు సందీప్ కిషన్.


దేవుడిని అదే కోరుకున్నాను..


‘‘దెయ్యాలు, భూతాలతో పాటు ప్రేమకథ కూడా ఉండే ఒక మంచి కమర్షియల్ సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. కొత్త కథ, కొత్త కథనంతో ఉండే ఒక మంచి కమర్షియల్ సినిమా. ప్రతీ సినిమా రిలీజ్ రోజు నాకు టెన్షన్ ఉంటుంది. ఫిబ్రవరీ 14 సాయంత్రం మేము ప్రీమియర్స్ ఏర్పాటు చేశాం. 70కు పైగా షోలు ఫుల్ అయిపోయాయి. చాలా బాధ్యతగా అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కు ముందే ఇన్ని షోలు ఫుల్ అయ్యి.. ఇంతమంది మా సినిమాను నమ్మి వస్తున్నారంటే మా మీద నమ్మకంతోనే వస్తున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర అదే వేడుకొని వచ్చాను.. స్వామి ఎలాగైనా మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చూడు స్వామి అని’’ అంటూ బయటపెట్టాడు సందీప్ కిషన్. 14 ఏళ్లుగా తనను ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.


Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?