Guntur Kaaram Pre Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ (Pre Release Event) మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నంబూరులో జరిగింది. ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తు నిమిత్తం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి కార్యక్రమ ప్రాంగణానికి తరలి వెళ్లిన ఎస్సై వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల తోపులాటలో ఎస్సై కుడి కాలుపై ఐరన్ బారికేడ్ పడింది. దానిపై అభిమానులు ఎక్కడంతో ఎస్సై కుడికాలుగా గాయమైంది. వెంటనే ఆయన్ను తోటి సిబ్బంది హుటాహుటిన గుంటూరు డొంక రోడ్ లోని శ్రీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈవెంట్ మేనేజర్ల వైఫల్యం
మహేష్ బాబు గుంటూరు కారం ఈవెంట్‌లో ఈవెంట్ మేనేజర్‌ల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని పోలీసులు, మహేష్ అభిమానులు ఆరోపించారు. సరైన సదుపాయాల కల్పించలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుందా కార్యక్రమాన్ని నిర్వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పాణాలంటే అంత అలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేయలేకపోవడంతో అభిమానుల మధ్య తోపులాట జరిగిందని, పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 


పోలీసుల లాఠీచార్జ్
ప్రిరిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ తో పాటు.. హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిని చూసేందుకు సైతం జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. దాంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యపడలేదు.  పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంత జరిగినా నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభిమానులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అంటున్నారు. ఒక దశలో అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దాంతో పలువురికి గాయాలు అయ్యాయి.


15 వేల మంది వచ్చారు
సుమారు 5 వేల మందికి  సరిపోయేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. అయితే 15 వేల మందిని రావడంతో నిర్వాహకులు చేతులెత్తాశారు. అభిమానుల తాకిడి తట్టుకోలేక లాఠీ ఛార్జీ చేసిననట్టు చెబుతున్నారు. నిర్వాహకులు, పోలీసుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వచ్చాయి. నిర్వహకులు పట్టించుకోకపోవడంతో పోలీసులు కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత పరిస్థితి గమనించి కార్యక్రమాన్ని త్వరత్వరంగా ముగించేశారు.   


12న థియేటర్లలోకి గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించగా, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాంకీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ టీజర్‌, ట్రైలర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది.